ఈటలతో పాటు జమున నామినేషన్!.. హుజురాబాద్ బరిలో ఆ ఇద్దరు?
posted on Jul 16, 2021 @ 5:11PM
ఆరుసార్లు ఎమ్మెల్యే. ఏడోసారి కూడా గెలిచి తీరాలనే పట్టుదల. తనను అవమానకరంగా మెడబట్టి గెంటేసిన కేసీఆర్‌కు.. తాను గెలిచి గట్టి గుణపాఠం చెప్పాలనే రివేంజ్. తన సొంత బలం సరిపోదనుకున్నారో ఏమో.. బీజేపీలో చేరి కమలనాథులను సైతం తోడేసుకొని కేసీఆర్‌పై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక తన గెలుపు ఈజీ అనుకుంటున్నంతలోనే.. అనుకోని ఉపద్రవం రేవంత్‌రెడ్డి రూపంలో వచ్చిపడింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకంతో సమీకరణాలు మళ్లీ తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినా, గెలుపుపై ధీమా వదలకుండా.. మరింత పట్టుదలతో పోరాడుతున్నారు ఈటల రాజేందర్. నియోజక వర్గంలో పాదయాత్రతో మరింత పట్టుకు ప్రయత్నిస్తున్నారు. ఈటల ఇంతగా చెమటోడుస్తుండగా.. ఆయనతో పాటు సమానంగా ఆయన సతీమణి జమునారెడ్డి సైతం హుజురాబాద్ గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తుండటం ఆసక్తికరం. ఇన్నాళ్లూ ఈటలకు తోడుగా ఇంటింటి ప్రచారంతో పాటు రాజకీయ మంత్రాంగాలు సైతం నెరపిన ఈటల జమున.. తాజాగా, హుజురాబాద్‌లో నామినేషన్‌కు సైతం రెడీ అవుతుండటం ఆసక్తికర పరిణామం.
అదేంటి.. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్ బరిలో దిగుతున్నారు కదా.. మరి, జమునారెడ్డి నామినేషన్ వేయడం ఏంటి? నామినేషన్‌పై డౌట్ ఉంటే ఆయనే రెండు సెట్లు వేస్తారు కానీ ఇంకొకరితో ఎందుకు వేయిస్తారు? ఒకే కుటుంబం నుంచి రెండు నామినేషన్లు వేయడం ఎందుకు? జమున కూడా నామినేషన్ వేస్తే ఈటల ఊరుకుంటారా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, జమునారెడ్డి నామినేషన్ వేయడం ఇదే తొలిసారి కాదట. గతంలో కూడా నామినేషన్ వేశారట. ఇప్పటి వరకూ ఈటల ఎన్నిసార్లు నామినేషన్లు వేశారో.. అన్నిసార్లు ఆయనతో పాటు ఆమె కూడా నామినేషన్ వేయడం అలవాటు, సెంటిమెంటుగా వస్తోందట. ఆమేరకు ఈసారి కూడా బీజేపీ నుంచి రాజేందర్.. ఇండిపెండెంట్‌గా జమునారెడ్డి నామినేషన్లు వేయనున్నారని తెలుస్తోంది. ఇలా ఏళ్లుగా భార్యాభర్తలు నామినేషన్లు వేస్తున్న వ్యవహారం హుజురాబాద్‌లో ఆసక్తిగా మారింది.
ఆరుసార్లు వరస విజయాలు సాధించిన ఈటల రాజేందర్.. ఏడోసారి పోటీకి కూడా తనతో ఏడడుగులు నడిచిన అర్థాంగిచే.. ఏడోసారి కూడా నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఆరుసార్లు బరిలో నిలిచిన రాజేందర్‌తో పాటు ఆయన భార్య జమున కూడా ఆరుసార్లు నామినేషన్లు వేసి.. ఆ తర్వాత విత్ డ్రా చేసుకున్నారు. ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ తరుపున రెండు సెట్లు వేయగా.. మిగతా ఐదుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసి.. ఉపసంహరించుకున్నారు. ప్రతీసారీ ఈటలతో పాటు ఆయన భార్య నామినేషన్ వేయడం సెంటిమెంట్‌గా కొనసాగుతోందని అంటుంటే, ఈటల రాజేందర్ నామినేషన్ తిరస్కరణకు గురైతే జమునను పోటిలో ఉంచే అవకాశం ఉంటుందనే ఇలా చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే, 2014లో జమునారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టుగానే.. ఈ సారి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారా? లేక.. మిగతా ఐదుసార్లు వేసినట్టు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.