తాలిబాన్ల తూటాలకు భారతీయ జర్నలిస్టు బలి
posted on Jul 16, 2021 @ 6:35PM
తాలిబాన్ టెర్రరిస్టుల తూటాలకు ఓ భారతీయ జర్నలిస్టు ప్రాణాలు విడిచాడు. బువ్వ పెట్టే వృత్తి కోసం బతుకునే తృణప్రాయంగా సమర్పించుకున్నాడు. భారత్ లో రాయిటర్స్ వార్తా సంస్థకు చీఫ్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్న డానిష్ సిద్దిఖీని ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధాన్ని కవర్ చేసేందుకు వెళ్లాలని రాయిటర్స్ సంస్థ ఆదేశించింది. దీంతో ఆయన రెండు వారాల క్రితమే ఆఫ్ఘన్ బయల్దేరి వెెళ్లాడు. వారం రోజులుగా యుద్ధాన్ని కవర్ చేస్తున్నాడు. పాత్రికేయ వృత్తిని ప్రాణప్రదంగా ప్రేమించే సిద్దిఖీ బంగ్లాదేశ్ లో రోహింగ్యాల కష్టాల కవరేజీపై ఇప్పటికే ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. సొంత గూడు లేని రోహింగ్యాలు ఎదుర్కొంటున్న కష్టాలను తన ఫొటోల ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి సిద్దిఖీ మంచి ఫొటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. సాధారణంగా యుద్ధ వార్తల్ని కవర్ చేసే పాత్రికేయులు అధికార భద్రతా దళాల రక్షణలోనే పనిచేస్తారు. వారి సూచనలు పాటిస్తూ, వారిలాగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి యుద్ధరంగంలో సంచరిస్తూంటారు. ఈ క్రమంలోనే సిద్దిఖీ కూడా ఆఫ్ఘన్ దళాల రక్షణలో తాలిబాన్లతో జరుగుతున్న యుద్ధాన్ని కవర్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
ఆఫ్ఘనిస్థాన్ ను క్రమంగా ఆక్రమించుకునేందుకు తాలిబాన్లు కొద్దిరోజులుగా పాక్ వైపు నుంచి ముందుకు కదుల్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూడా కాందహార్ లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని రద్దు చేసుకుంది. 50 మంది సిబ్బంది, ఇతర అధికారులను ప్రత్యేక విమానం ద్వారా జులై 10న ఇండియా రప్పించుకుంది. ఈ క్రమంలోనే తాలిబాన్లు క్రమంగా పలు జిల్లాల సరిహద్దులను, ముఖ్యమైన పట్టణాలను ఆక్రమించుకుంటూ కాందహార్ ను కూడా గుప్పిట పెట్టుకునే దిశగా ముందుకొస్తున్నారు. తాలిబాన్లను నిలువరించేందుకు ఆఫ్ఘన్ కమెండోలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో స్పిన్ బోల్డక్ అనే పాక్ సరిహద్దు జిల్లాలో ఆఫ్ఘన్ కమెండోలపై జరిగిన దాడిలో సిద్దిఖీ చనిపోయాడు. ఈ దాడిలో ఆఫ్ఘన్ దళాల వైపు నుంచి సేదిక్ కర్జాయ్ అనే స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు అంబాసిడర్ ఫరీద్ మాముండ్జే ధ్రువీకరించారు.
తాలిబాన్లతో జరుగుతున్న యుద్ధంలో గత మంగళవారం ఆఫ్ఘన్ కమెండోల వైపు నుంచి ఓ సైనికుడు గాయాలపాలై కనిపించకుండా తప్పిపోయాడు. ఆయన్ని వెదికి ప్రాణాలతో తీసుకొచ్చేందుకు ఆఫ్ఘన్ కమెండోలు ఓ జట్టుగా ఏర్పడి ఆపరేషన్ చేపట్టారు. వారి వెహికల్ లోనే ఉంటూ సిద్ధిఖీ ఈ ఘటనను కవర్ చేస్తుండగా తాలిబాన్లు వదిలిన బుల్లెట్లు వీరి వెహికల్ అద్దాలను ఛిద్రం చేసుకుంటూ లోపలికి దూసుకొచ్చాయి. అక్కడే తన పని అయిపోయిందనుకున్న సిద్దిఖీ తన పక్కనుంచే బుల్లెట్లు దూసుకుపోతున్న ఘటనను కూడా కెమెరాలో బంధించి.. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయడం విశేషం. తాలిబాన్లు పాక్ సరిహద్దు నుంచి ఆఫ్ఘన్లో చొరబడి కాందహార్ ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.