జగన్‌కు నిరుద్యోగ సెగ.. తాడేపల్లి ప్యాలెస్ ముట్టడితో ఉద్రిక్తత..
posted on Jul 19, 2021 @ 11:02AM
కరోనా కేసులు తగ్గాయి. ఆంక్షలు సడలిపోయాయి. ఇప్పుడిక సీఎం జగన్‌పై ప్రజల్లో ఉన్న ఆగ్రహజ్వాల ఎగిసిపడుతుంది. ఇన్నాళ్లూ కరోనా భయంతో ప్రజలు రోడ్ల మీదకు రాలేదు. జగన్ సర్కారుపై ఉద్యమాలు చేయలేదు. అదంతా తమ ప్రభుత్వ గొప్పతనమంటూ గొప్పలు పోయింది గవర్నమెంట్. కరోనా భయం పోవడంతో.. ఇప్పుడిక అసలైన ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. గడిచిన కొన్ని రోజులుగా నిత్యం ఏదో ఒక అంశంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు రగులుతూనే ఉన్నాయి.
తాజాగా జాబ్ క్యాలెండర్‌పై విద్యార్థి సంఘాలు ఏకంగా సీఎం జగన్ నివాసాన్నే చుట్టుముట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ వివిధ యువజన, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. తాడేపల్లి పాత టోల్‌గేట్ కూడలి దగ్గర ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారులను గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా సుమారు వెయ్యి మంది పోలీసులు మోహరించారు. సీఎం ఇంటి వైపు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఆదివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టుల పర్వానికి తెరతీశారు. చలో తాడేపల్లికి అమరావతి దళిత ఐకాస మద్దతు తెలిపడంతో.. జేఏసీ నేతలను ఇళ్లలోనే నిర్బంధించారు పోలీసులు. డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.