వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఎన్ కౌంటర్?
posted on Jul 19, 2021 @ 9:31AM
కృష్ణా జిల్లాలో అధికార వైసీపీ నేతలు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ దళిత యువకులపై అరాచకానికి దిగారు. వైసీపీ నేతలు దౌర్జాన్యానికి దిగినా.. పోలీసులు పట్టించుకోలేదని, బాధితుడినే డీఎస్పీ హెచ్చరించారనే ఆరోపణలు వస్తున్నాయి. నూజివీడులో వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ నూజివీడుకు చెందిన దళిత యువకులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి, విచక్షణారహితంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు... వైసీపీ నేతల మాట మేరకు బాధిత దళిత యువకులపైనే కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ రఘురామకృష్ణం రాజును కస్టడీలో కొట్టారంటూ హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు చేసిన దళిత యువకుడు మణిరత్నంను దొంగ కేసులు పెట్టి, మళ్ళీ ఫోన్ పట్టుకుంటే ఎన్ కౌంటర్ చేస్తానని నూజివీడు DSP బెదిరించారని చెబుతున్నారు.
నూజివీడు మండలం బోర్వంచకు చెందిన బేతమాల మణిరత్నం... ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయంపై ఎన్‌హెచ్‌ఆర్సీకి మే 14న ఫిర్యాదు చేశాడు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు కస్టడీలో ఉన్నప్పుడు కొట్టారు.. ఒక ఎంపీకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుని పరిస్తితి ఏంటి అని తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మణిరత్నం ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కమిషన్... రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. వెంటనే కంగుతిన్న పోలీసులు ఈ కంప్లెయింట్ ఇచ్చింది ఎవరా అని అరా తీసి నూజివీడుకు చెందిన మణిరత్నం అని తెలుసుకున్నారు. అప్పటి నుంచి వైసీపీ శ్రేణులు మణిరత్నంపై బెదిరింపులకు దిగాయి.
శనివారం రాత్రి నూజివీడు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న దళిత యువకుడు మణిరత్నం, అతడి స్నేహితుడు నాగబాబుని వైసీపీకి చెందిన పిళ్లా చరణ్, నత్తా నాగేశ్వరరావు, మరి కొందరు కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. నూజివీడులోని నెహ్రూపేట తీసుకువెళ్లి విచక్షణా రహితంగా కొట్టినట్టు బాధితులు ఆరోపించారు. దీనిపై బాధితులు స్థానిక టీడీపీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. అయితే స్థానిక పోలీసులు కూడా వైసీపీ నేతలకు వత్తాసు పలికారని బాధితులు ఆరోపించారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో అదుపులోకి తీసుకున్న టీడీపీ కార్యకర్తలను స్టేషన్ బెయిల్‌పై వదిలేశారు.అయితే దాడికి పాల్పడిన వైసీపీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
వైసీపీ ముష్కరులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. నూజివీడులో టీడీపీ కార్యకర్తలు మణి, నాగబాబులపై వైసీపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. నూజివీడు ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.