ఈటలను చంపడానికి కుట్ర?.. హుజురాబాద్‌లో కలకలం..!
posted on Jul 19, 2021 @ 3:33PM
హుజురాబాద్ ఉప ఎన్నిక. ప్రాణం పెట్టి మరీ పోరాడుతున్నారు ఈటల రాజేందర్. తాను గెలిచి సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. ఊరూరా తిరుగుతూ.. ప్రజలను పలకరిస్తూ.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌పై ఇంతలా పోరాడుతున్న తనను.. అడ్డుతొలగించుకునేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హుజురాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కలకలంగా మారాయి.
‘ప్రజా జీవన యాత్ర’ లో భాగంగా శనిగరంలో పాదయాత్ర చేసిన ఈటల కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకార్లను తలపిస్తున్నారని ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు సీఎం వెలకట్టారని ఆరోపించారు. తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్రలు చేస్తున్నారన్నారు. హంతక ముఠాలతో చేతులు కలిపినట్టు తనకు సమాచారం వచ్చిందన్నారు.
‘అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని.. ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది.. 2018లో నన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా.. నా ప్రజలు అండగా నిలిచారు.. ఇప్పుడూ నిలుస్తారు.. చట్టం మీద నాకు విశ్వాసం ఉంది.. పోలీసులు సహకరించండి’’ అంటూ ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలతో హుజురాబాద్‌లో హైటెన్షన్ క్రియేట్ అయింది. ఈటలకు రక్షణగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈటల యాత్ర ఆసాంతం.. ఆయనకు తోడుగా ఉంటామంటున్నారు. ఈటలకు ఏదైనా జరిగితే సీఎం కేసీఆర్‌దే బాధ్యత అంటూ హెచ్చరిస్తున్నారు.