కెప్టెన్ కాదన్నా సిద్దూకే పగ్గాలు.. రేవంత్ రెడ్డిని ఫాలో అవుతారా..
posted on Jul 19, 2021 @ 9:31AM
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మరో కీలక, సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా మాజీ క్రికెటర్, మాజీ మంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ నియమించారు. అలాగే,త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అన్నివర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా అప్పాయింట్ చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వర్గం చివరి క్షణం వరకూ సిద్దూ నియామకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. పది మంది ఎమ్మెల్యేలు సిద్ధూ వద్దంటూ బహిరంగ ప్రకటన చేశారు. అంతే కాదు, పంజాబ్ నుంచి ఎన్నకైన 11 ఎంపీలలో తొమ్మింది మంది, మాజీ పీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ బజ్వా నివాసంలో కలిసి, సిద్ధూ ఎందుకు వద్దో వివరించేందుకు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పాయింట్మెంట్ కోరారు. అలాగే, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్ ఝాకర్, అధిష్ఠానం పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా ఎవరిని నియమించినా అభ్యంతరం లేదని, అయితే కొత్త అధ్యక్షుడు అందరికీ అమోదయోగ్య వ్యక్తీ అయి ఉండాలని తీర్మానం చేసే ఉద్దేశంతో సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలను గమనించిన అధిష్టానం ఇంకా జాప్యంచేయడం మంచిది కాదని, ఆలస్య జరిగిన కొద్దీ అనర్ధాలను కొని తెచ్చుకోవడమే అవుతుందని నిర్ణయాన్ని ప్రకటించింది.
అందుకే సిద్దూ వ్యతిరేక శిబిరం తమ ప్రయత్నాలలో తాముండగానే, కాంగ్రెస్ అధిష్ఠానం, ‘తాంబూలాలు ఇచ్చేశాంతన్నుకు చావండి’ అన్న రీతిలో సిద్దూను పంజాబ్ పీసీసీ చీఫ్ గా ప్రకటించింది. అయితే, ముఖ్యమంత్రి మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు వరకు మెజారిటీ నాయకులు వ్యతిరేకించినా కాంగ్రెస్ అధినాయకత్వం సిద్దూను పీసీసీ చీఫ్’గా నియమించడం రాజకీయ వర్గాల్లో ఒక రకంగా విస్మయాన్ని కలుగ చేసింది. అయితే, సిద్దూకు రాహుల్ గాంధీ ఇచ్చిన హమీ మేరకే, ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఒక విధంగా చూస్తే, తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంలో అనుసరించిన ఫార్ములానే పంజాబ్ విషయంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానం అనిసరించిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎప్పుడొచ్చారు అనేది కాదు, కొత్త రక్తంతో పార్టీలో జవసత్వాలు నింపడమే ప్రధానంగా రాహుల్ గాంధీ భావిస్తున్నారని అందుకే, దూకుడుగా పార్టీని ముందుకు తీసుకు పోయేశక్తి సామర్ధ్యాలున్న రేవంత్ రెడ్డి, సిద్దూలాంటి ఉండుకు రక్తానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.
రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతూనే పార్టీ సీనియర్లను కలుపుకు పోయేందుకు, ప్రయత్నించారు, చాల వరకు సఫలమయ్యారు. రేవత్ నియామకాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన వీహెచ్ వంటి నాయకులు కూడా ఇప్పుడు కూల్ అయి పోయారు. సొంతపార్టీలోని సేనియర్ నాయకులనే కాకుండా ఇతర పార్టీలలో ఉన్న దేవేందర్ గౌడ్ వంటి అనుభవజ్ఞులను కూడా రేవంత్ కలుపుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి సిద్దూ కూడా రేవంత్’ను ఫాలో అవుతారా, ముఖ్యమంత్రి మరీందర్ సింగ్ ఆయన వర్గాన్ని కలుపుకు పోతారా? అలాగే, అమరీందర్ సింగ్ వర్గం, గతం గతః, అయిపోయిందేదో అయి పోయిందని ... సిద్దూతో చేతులు కలుపుతారా? చూడవలసి వుంది. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎంతగా కొట్టుకుంటే అంతగా కలిసిపోయే కల్చర్ ఎప్పటి నుంచో వుంది . సో .. తెలంగాణలో రేవంత్ లానే పంజాబ్ లో సిద్దూ సక్సెస్ అవుతారని అనుకోవచ్చును.