రేవంత్‌రెడ్డి ఖతర్నాక్ స్కెచ్.. కేసీఆర్‌కు దిమ్మతిరిగే షాక్..
posted on Jul 19, 2021 @ 11:36AM
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా.. దానికో లెక్కుంటుంది. దాని వెనక కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసే స్కెచ్ ఉంటుంది. రేవంత్ మాటలు, చేష్టలూ అన్నీ వ్యూహాత్మకమే. కేసీఆర్ ఊహలకు అతీతమే. తాజాగా, తెలంగాణ సర్కారును ఇరకాటంలో పడేసేలా మరో ఉచ్చు పన్నారు ఎంపీ రేవంత్‌రెడ్డి. పోలీసులు వచ్చి సరిగ్గా ఆ ఉచ్చులో చిక్కారు. ఇప్పుడు లాక్కోలేక, గింజుకోలేక గిలగిల్లాడుతున్నారు. సరైన సమయం, సందర్భం చూసి రేవంత్ పన్నిన ఆ పన్నాగంలో చిక్కుకోవడంతో తెలంగాణ సర్కారుకు మైండ్ బ్లాంక్ అవుతోంది.
రంగారెడ్డి జిల్లా కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల స్కాం జరిగిందంటూ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తోంది. సీఎం కేసీఆర్ తన బినామీలకు వేలంలో ఖరీదైన భూములను చవక ధరకే కట్టబెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోకాపేటలో ధర్నాకు పిలుపిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతల ముందస్తు హౌజ్ అరెస్టులకు దిగారు. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో గృహ నిర్భందం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇలా జరుగుతుందని రేవంత్‌రెడ్డికి ముందే తెలుసు. అందుకే, ఆయన వ్యూహాత్మకంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే.. కోకాపేటలోఉ ధర్నాకు పిలుపిచ్చారు. పోలీసులు తనను హౌజ్ అరెస్ట్ చేయడంతో.. తాను పార్లమెంట్ సమావేశాలకు వెల్లకుండా తెలంగాణ పోలీసులు తనను అడ్డుకున్నారంటూ ఢిల్లీ స్థాయికి సర్కారును ఇరకాటంలో పడేశారు.
తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా అడ్డుకుని తన హక్కులకు భంగం కలిగించారంటూ రేవంత్ ఆరోపించారు. ఆ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు ఎంపీ రేవంత్‌రెడ్డి. ఇదేమీ చిన్న విషయం కాదు. ఒక ఎంపీని పార్లమెంట్‌కి రాకుండా అడ్డుకోవడమంటే.. అది పార్లమెంట్‌పై జరిగిన దాడిగానే భావిస్తారు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన కేసీఆర్ సర్కారు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఎక్కడ పార్లమెంట్ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందోనని తెగ ఇదైపోతోంది.
రేవంత్‌రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేయకపోతే కోకాపేటలో ధర్నాకు దిగి సర్కారును ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తారు.. ఆయన కోకాపేట వెళ్లకుండా గృహ నిర్బంధం చేస్తే.. తనను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ నేరుగా స్పీకర్‌కే ఫిర్యాదు చేశారు. ఇలా ఎలాగైనా సర్కారును ఇరకాటంలో పడేసేలా.. రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అరకత్తరలో పోకచెక్క మాదిరి తయారైంది ప్రభుత్వ పరిస్థితి. రేవంత్‌రెడ్డి దెబ్బకు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అవుతోంది.