టీడీపీకి కొత్త బాస్.. ఒకరుపోతే ఇంకొకరు.. నేతల గ్యారేజ్
posted on Jul 19, 2021 @ 12:09PM
టీడీపీ. ఇదొక పార్టీ కాదు ఫ్యాక్టరీ. నాయకులను తయారు చేసే కార్ఖానా. నేతల గ్యారేజ్. తెలుగుదేశంలో నాయకులకు గానీ, కార్యకర్తలకు గానీ, అభిమానులకు గానీ కొదవేలేదు. పార్టీ నిండా సమర్థవంతులైన నాయకులే. చంద్రబాబు నుంచి గ్రామ టీడీపీ అధ్యక్షుని వరకూ.. అంతా నిఖార్సైన నేతలే. పార్టీకి లీడర్ల కొరత లేనేలేదు. ఒకరు పోతే ఇంకెకరు రెడీగా ఉంటారు. అందరూ హేమాహేమీల్లాంటి వారే. ఎవరు ఎవరికీ తక్కువేం కాదు. తాజాగా, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ గూటికి చేరడంతో.. ఆ వెంటనే నేనంటే నేనంటూ టీటీడీపీ పగ్గాల కోసం చాలామంది నాయకులు ప్రయత్నించారు. రేసులో ఐదుగురు టాప్ లీడర్లు నిలిచారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా టీడీపీకి బలమైన ఓటుబ్యాంక్, కేడర్ ఉంది కాబట్టే.. ఆ పదవికి అంత డిమాండ్. రావుల చంద్రశేఖర్‌రెడ్డి నుంచి నన్నూరి నర్సిరెడ్డి వరకూ చాలా మంది బడా నేతలే బరిలో నిలిచారు. చివరాఖరికి పార్టీ అధినేత చంద్రబాబు విస్తృత కసరత్తు చేసి.. ఓ దళిత నేతకు టీటీడీపీ పగ్గాలు అప్పగించి.. అసలైన నాయకుడిగా నిలిచారు. బీసీలు, దళితులకు టీడీపీనే సరైన వేదిక అని నిరూపించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమించారు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు.
మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కని నర్సింహులు 1994-99లో షాద్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. దళితుడైన బక్కనిని టీటీడీపీ అధ్యక్షుడిని చేశారు చంద్రబాబు. పార్టీ కోసం చిత్తశుద్ధిగా పని చేసే ఎలాంటి నాయకుడికైనా ఏదో ఒక రోజు మంచి పదవులు ఖాయమనే మెసేజ్ ఇచ్చారు.
తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు బక్కని నర్సింహులు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా బక్కని నర్సింహులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సింహులును అభినందించిన లోకేష్.. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపిచ్చారు.