రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్.. కోకాపేట భూములపై ఫైట్..
posted on Jul 19, 2021 9:21AM
రంగారెడ్డి జిల్లా కోకాపేట భూముల వేలం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. సీఎం కేసీఆర్ తన బినామీలకు ఖరీదైన భూములను చవక ధరకే కట్టబెట్టేందుకే వేలం నిర్వహించారని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. కోకాపేటలో ధర్నాకు పిలుపిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గృహ నిర్భందం చేయడంతో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఈ తెల్లవారుజామున మూడు గంటల నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రేవంత్‌ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి నుంచి ఎవరూ కదలకుండా అడ్డుకుంటున్నారు. పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు కూడా కోకాపేట భూముల సంద్శనకు వెళ్లడానికి సమాయత్తమయ్యారు. భూముల సందర్శనకు వెళ్లే నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు.
కోకాపేట భూముల విషయంలో జరిగిన అక్రమాలపై పార్లమెంట్ తొలి సమావేశంలో ప్రభుత్వ అక్రమాలపై ఫిర్యాదు చేస్తానని ఇటీవల ప్రకటించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ భూములు అమ్మకాలల్లో వెయ్యి కోట్లు అక్రమాలు జరిగాయని.. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావ్, సీఎస్ సోమేశ్ కుమార్, సిద్దిపేట కలెక్టర్ లపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తొలి రోజు పార్లమెంట్ కు వెళ్లకుండా ఇంటిముందు పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.