హుజురాబాద్ లో కేసీఆర్ సూపర్ స్కెచ్..
posted on Jul 18, 2021 @ 10:16PM
తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజారాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను తన సొంత నియోజకవర్గంలో గెలిచి కేసీఆర్ కు షాకివ్వాలని భావిస్తున్నారు. ఈటలను ఓడించేందుకు గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంలో కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. మూడు ప్రధాన పార్టీల ఫోకస్ అంతా ఇక్కడే ఉండటంతో హుజురాబాద్ రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజేతగా నిలబడే పార్టీనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత కీలకం కావడంతో సీఎం కేసీఆర్ సూపర్ స్కెచ్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. "తెలంగాణ దళిత బంధు" అనే పేరును ఖరారు చేసిన కేసీఆర్.. ఆ పథకాన్ని మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రాంరంభోత్సవ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కేసీఆరే హుజురాబాద్ లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.
దళిత బంధు అమలు కోసం హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితి గతులను తెలుసుకుంటారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలు, వీణవంక మండలం లో 3678 కుటుంబాలు, జమ్మికుంట మండలంలో 4996 కుటుంబాలు , ఇల్లంతకుంట మండలం లో 2586 కుటుంబాలు ఉన్నాయి. మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింప చేస్తారు.
దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నుంచి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. హుజారాబాద్ లో గెలవడం కష్టమని తేలడంతో కొత్త ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. హుజురాబాద్ లో కొన్ని కుటుంబాలకు సాయం చేసి ఓట్లు దండుకుంటారని, తర్వాత ఆ స్కీంను ఆపివేస్తారని అంటున్నారు. గతంలో దళితులకు మూడు ఎకరాల భూపంపిణి విషయంలోనూ ఇదే జరిగిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దళితకు కొత్త పథకం ప్రకటించినప్పుడే తాము హుజురాబాద్ కోసమే ప్రకటించారని చెప్పామని, ఇదే ఇప్పుడు నిజమైందని అంటున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ నేతలు మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారని అంటున్నారు. ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకం హుజూరాబాద్ కేంద్రంగానే మొదలైందని...అదే ఆనవాయితీని సిఎం కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారని స్పష్టం చేస్తున్నారు గులాబీ నేతలు.