పార్లమెంట్ లో తొలి రోజే రచ్చ.. తమను మాట్లాడనీయాలన్న ప్రధాని మోడీ
posted on Jul 19, 2021 @ 12:23PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే రచ్చరచ్చైంది. విపక్షాల ఆందోళనలో ఉభయసభలు దద్దరిల్లాయి. లోక్ సభ ప్రారంభం కాగానే... కొత్తగా ఎంపీలుగా గెలిచిన నలుగురు సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రమాణం చేశారు. తర్వాత కేబినెట్ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు ప్రధాని మోడీ. అయితే ఈ కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. కొవిడ్ , చమురు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో నిరసనల మధ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఎక్కువమంది ఎస్సీలు, మహిళలు మంత్రులు కావడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. కేబినెట్‌లో అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశామని తెలిపారు ప్రధాని మోడీ.
లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసంగంపై ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకింగా ఆప్ వాయిదా తీర్మానం ఇచ్చింది. తామిచ్చిన వాయిదా తీర్మానాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో లోక్ సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో సభను వాయిదా వేశారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.
మరోవైపు ప్రతిపక్షాలు కఠిన ప్రశ్నలను ఎన్నైనా సంధించొచ్చని, కానీ, వాటికి జవాబు చెప్పేందుకు ప్రభుత్వాన్ని మాట్లాడనివ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. అందరు ఎంపీలు, అన్ని విపక్షాలు అత్యంత కఠినమైన, తెలివైన ప్రశ్నలను సంధించాలని కోరుతున్నానన్నారుసమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన మోడీ.. సభలో క్రమశిక్షణతో మెలగాలని ప్రతిపక్ష సభ్యులకు హితవు చెప్పారు. అలాగైతేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని చెప్పారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ పైనా మాట్లాడారు ప్రధాని మోడీ. వ్యాక్సిన్ వేసుకున్న వారంతా బాహుబలులేనని చమత్కరించారు. ‘‘టీకాను భుజాలకు (బాహువు) వేస్తారు. కాబట్టి, టీకాలేసుకున్న వారంతా బాహుబలులు. ఇప్పటికే 40 కోట్ల మంది బాహుబలులయ్యారు. మిగతా వారూ టీకా తీసుకుని బాహుబలి అవ్వాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గుప్పిట పట్టేసిందని, సభలో దానిపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.