సంతోష్ గుప్పిట్లో ప్రగతి భవన్.. రగిలిపోతున్న కేటీఆర్? సీఎం పోస్టు కోసం కోల్డ్ వార్?
posted on Jul 19, 2021 @ 1:24PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తుందా? ప్రగతి భవన్ లో పెత్తనంతా సంతోష్ రావు చేతుల్లోకి వెళ్లిందా? కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి కావాలని సంతోష్ పావులు కదుపుతున్నారా? సంతోష్ తీరుతో కేటీఆర్, కవిత కన్నీళ్లు పెట్టుకుంటున్నారా?.. కేసీఆర్ కుటుంంబంలో విభేదాలు వచ్చాయంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావించినా... కుటుంబ గొడవల వల్లే వెనక్కి తగ్గారనే చర్చ కూడా ఉంది. పదవుల విషయంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య వార్ నడుస్తుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు.
కేసీఆర్ ఇంట్లో రెండు గ్రూపులయ్యాయని గోనే ప్రకాష్ రావు చెప్పారు. పెత్తనమంతా రాజ్యసభ సభ్యుడు సంతోష్ చేతుల్లోకి వెళ్లిందన్నారు. ప్రగతి భవన్ లోని ప్రతి అధికారి, ఉద్యోగి సంతోష్ కుమార్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఎవరు కేసీఆర్ ను కలవాలన్నా సంతోష్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలన్నారు. కేటీఆర్ కూడా తన తండ్రిని కలవాలంటే సంతోష్ కు ఫోన్ చేయాల్సిందేనని చెప్పారు గోనే ప్రకాష్ రావు. కేటీఆర్, కవిత కూడా ప్రగతి భవన్ లో స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదన్నారు. ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే బెడ్రూంకు తలుపులు వేసుకుని, కార్లలో కూర్చుని వాళ్లు మాట్లాడుకుంటున్నారని తెలిపారు. కేటీఆర్, కవిత ప్రగతి భవన్ లో ఏం మాట్లాడుకున్నా సంతోష్ కు తెలుస్తాయని భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర పాలనలో చక్రం తిప్పుతున్న ఎంపీ సంతోష్ కు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన పుట్టిందన్నారు గోనే ప్రకాష్ రావు.
కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉండే గ్రూపును సంతోష్ లీడ్ చేస్తున్నారని గోనే ప్రకాష్ రావు తెలిపారు. ఇంతకాలం హరీశ్, కేటీఆర్ ల మధ్య పోటీ ఉండగా.. ఇప్పుడు కేటీఆర్, సంతోష్ మధ్య యుద్దం నడుస్తోందన్నారు. కనీసం హోంమంత్రికి కూడా ఇవ్వకూడని డీఐజీ ఇంటిలెజెన్స్ నివేదికలను కూడా సంతోష్ తీసుకుంటున్నారని ఆరోపించారు. డీజీపీ,డీఐజీ ఇంటిలెజెన్స్ లాంటి ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ వంటి కీలక విషయాలను నేరుగా సీఎంకే వివరించడం ఆనవాయితీ అని.. కాని ఇప్పుడు మాత్రం అంతా సంతోషే చూస్తున్నారని మండిపడ్డారు. మొక్కలు నాటే కార్యక్రమంతో సంతోష్ కుమార్ తన బల ప్రదర్శన చేస్తున్నారని చెప్పారు.సంతోష్ అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందని, త్వరలోనే ఆధారాలతో బయటపెడుతానని గోనే ప్రకాష్ రావు ఆరోపించారు. లల్లూ ప్రసాద్ యాదవ్, జయలలిత లాగే సంతోష్ కూడా త్వరలోనే జైలుకు పోవడం ఖాయమన్నారు.
మిడ్ మానేరు కింద ముంపునకు గురైన కొదురుపాక గ్రామంలో అర్హత లేని సంతోష్ కుమార్ బంధువులు వ్యవసాయ కూలీ కింద 2015లో పరిహారం తీసుకున్నారని గోనే ఆరోపించారు. 4-5 వేల కోట్ల రూపాయలు సంతోష్, ఆయన బినామీలు కూడబెట్టారని, త్వరలోనే ఆధారాలు బయటపెడుతానని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి అనే ఎమ్మెల్సీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ సంతోష్ కుమార్ వేనని ఆరోపించారు. సంతోష్ తండ్రి రవీందర్ రావు మిడ్ మానేరు దిగువన ఉన్న మాన్వాడనుంచి వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు 150 ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారని..ట్రాక్టర్లు నడిపేవాళ్ల దగ్గర నెలకు 13 వేల రూపాయలు రవీందర్ రావు తీసుకుంటారని ఆరోపించారు. ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసులు అడ్డుకోకుండా రవీందర్ రావు మీడియేటర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణా ఆపాలని, అమాయకులపై కేసులు ఎత్తివేయించాలని గోన్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు.