మహా ‘మేత’ దే పులిచింతల పాపం?.. ఇదిగో సాక్ష్యం..
posted on Aug 7, 2021 @ 8:00PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో క్రస్ట్ గేటు కొట్టుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గేటు కొట్టుకుపోవడంతో అధికార వైసీపీ పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ నెపాన్ని గత టీడీపీ ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు వల్లే పులిచింతల ప్రాజెక్టు నాసిరకం నిర్మాణంగా మిగిలిందని వైసీపీ నేతలంటున్నారు. వైసీపీ నేతలకు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ అనే మహానేత…ప్రాజెక్టుల పేరుతో మేత మేశాడు తప్ప ఏమీ చెయ్యలేదని, అందుకే పులిచింతల సహా ఆయన హయాంలో కట్టిన అనేక ఫ్లై ఓవర్లు,అనేక ప్రాజెక్టులు నాసిరకంగా మారాయని ఆధారాలతో సహా విమర్శలు గుప్పిస్తున్నారు. పులిచింతల డిజైన్లను చంద్రబాబు కాంట్రాక్టర్ మార్చారని, గేట్లు తగ్గించాడని, దాని వల్లే ఈరోజు గేటు ఊడిపోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధం అనడానికి 2006 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల రికార్డులే సాక్ష్యమని టీడీపీ నేతలు నిరూపిస్తున్నారు.
2006, ఫిబ్రవరి 25 అసెంబ్లీ రికార్డ్ నంబర్ 6301 ప్రకారం పులిచింతలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభ వాయిదా పడింది. కాంట్రాక్టర్ డ్యామ్ డిజైన్స్ కాంక్రీట్ నుండి మట్టికి మార్చారని, గేట్లు తగ్గించారని నాటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు సభలో గొడవ చేస్తే సమాధానం చెప్పలేక సభను వాయిదా వేసి నాటి సీఎం వైఎస్సార్ వెకిలి నవ్వులు నవ్వారని ఆరోపిస్తున్నారు. డిజైన్లు మారిస్తే ఏమీ కాదంటూ వైఎస్ చెప్పారని, కాంట్రాక్టర్ కి దాదాపు 50 కోట్లు మిగిలిందని ఆరోపిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పనుల నిర్వహణలో కాంట్రాక్టరుకు రూ.56.52 కోట్ల అనుచిత లబ్ది చేకూరింది'' అని 2009-10లో కాగ్ వైఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఆ తర్వాత మాజీ సీఎం రోశయ్య హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ హయాంలో రెండు సార్లు కాపర్ డ్యామ్ కొట్టుకుపోయి చివరకి సగం గేట్లతో ప్రాజెక్టు ఓపెన్ చేశారు.
అయితే నాసిరకం నిర్మాణం అంటూ కిరణ్ ప్రభుత్వం కాంట్రాక్టర్ పై కోర్టులో కేసు వేసింది. కానీ జలయజ్ఞం క్లాజుల వల్ల కాంట్రాక్టరే గెలిచాడు. దీంతో, 2014లో కాంట్రాక్టర్ కి 120 కోట్లు పరిహారం చెల్లించాలని కిరణ్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఈ నాసిరకం ప్రాజెక్టులో 8 టిఎంసిలకు మించి నీరు నిల్వ ఉంచకూడదని సీడబ్ల్యూసీ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు ప్రభుత్వంపైనా కాంట్రాక్టర్ గెలిచారు. దీంతో, కోర్టులకి వెళ్లటం దండగని రూ.190 కోట్లు రిలీజ్ చేసి, భూసేకరణకు రూ.70 కోట్లిచ్చి ఆ కాంట్రాక్టర్ కు దండం పెట్టారు చంద్రబాబు.ఆ తర్వాత వేరే కంపెనీతో పనులు చేయించి 2017 నాటికి 20 టిఎంసీల సామర్థ్యం తెచ్చిన ఘన చంద్రబాబుది. 2018 కల్లా ఫుల్ స్టోరేజ్ కి వచ్చేలా పనులు పూర్తి చేసింది చంద్రబాబు సర్కార్. అయితే బేస్ డిజైన్ మారలేదు కాబట్టి…ఎన్నికోట్లు పెట్టినా పులిచింతల అతుకుల బొంతగానే మిగిలిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం, ఈ నాసిరకం పనులు దృష్టిలో పెట్టుకునే, పూర్తిస్థాయిలో నీటిని నిల్వను ఎప్పుడూ చేయలేదు. జాగ్రత్తగా ఫ్లడ్ మానిటర్ చేస్తూ, డ్యాంను కాపాడుతూ వచ్చారు. డ్యామ్ మెయిన్ టినెన్స్ కు నిధులు కేటాయించారు.
పులిచింతల ప్రాజెక్టును 1988 నవంబర్ 13న ఎన్.టి.ఆర్ గారు మొదట శంకుస్థాపన చేశారు. 1994-95లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.501 కోట్లు. 2004 అక్టోబర్ 15న పులిచింతల ప్రాజెక్టుకు వైఎస్ భూమి పూజ చేశారు. 30-9-2004 తేదీన మెస్సర్స్ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ మరియు చైనా రైల్వే 18 బ్యూరో జాయింట్ వెంచర్ తో వైఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 18.11.2005 న జీవో నెం 208 ద్వారా సవరించిన అంచనా రూ.681 కోట్లు. 04.08.2009న జీవో నెం 90 ద్వారా వైఎస్ ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1281 కోట్లు. 29.01.2014న జీవో నెం. 7 ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1861 కోట్లు. భూసేకరణలో జాప్యం వలన ధరలు పెరిగినందుకున అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని శ్రీనివాస్ కన్ స్ట్రక్షన్ 2012లో ప్రభుత్వాన్ని కోరారు. దీనిని పరిశీలించిన డీఏబీ రూ.199 కోట్లను అధనంగా చెల్లించాలని 03.10.2013న ప్రతిపాదించారు. ఇది అమలు కాకపోవడంతో కోర్టుకు వెళ్లారు.
సుదీర్ఘంగా విచారణ జరిపి మచిలీపట్నం కోర్టు.. 02.06.2016న రూ.199 కోట్లతో పాటు 2013 నుండి వడ్డీ కల్పి రూ.399 కోట్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దానిపై హైకోర్టుకు ప్రభుత్వం వెళ్లగా కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం అనగా రూ.199 కోట్లను డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాన్ని 01.01.2019న ప్రభుత్వం అమలు పరిచింది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పులిచింతల మునక రైతుల పరిహారం కోసం రూ.128 కోట్లు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు రూ.199 కోట్లు చెల్లింపులు చేయడమైంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులకు పరిహారం చెల్లించి వారిని ఖాళీ చేయించడంలో వైఎస్ గాని, కాంగ్రెస్ గాని తగినంత శ్రద్ధ పెట్టలేదు. అందువలన ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగి, దానిపై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లారు.వారు చేసిన పాపానికి చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల ప్రకారం రూ.199కోట్లు చెల్లించింది. మరో 128 కోట్లు భూములు కోల్పోన రైతులకు చెల్లించింది.వైఎస్ ప్రభుత్వం కమీషన్లు పుచ్చుకునే పనులకు నిధులు విడుదల చేసి, రైతులకు పరిహారంలో కమీషన్లు రావు కనుక దాన్ని నిర్లక్ష్యం చేసింది.
డ్యాంకు గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్ లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్ గరిష్ఠంగా ఆరు మిల్లీ మీటర్లకు మించి ఉండకూడదని తెలిసినా, పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా పెట్టారు. దీంతో గేట్ల పై ఒత్తిడి పెరిగింది. మొత్తంగా సివిల్ పనుల్లో, మెకానికల్ పనుల్లో కూడా లోపాలతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసారు. 754.59 మీటర్ల దూరం స్పిల్‌వే నిర్మించాల్సి ఉండగా, 546 మీటర్లకు తగ్గించారు. 33 గేట్లు పెట్టాల్సి ఉండగా, కేవలం 24 గేట్లు పెట్టారు. కాంక్రీటు డ్యాం నిర్మించాల్సి ఉండగా, 355 మీటర్ల మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. డిజైన్ మార్చి, స్పిల్ వే తగ్గించటం, గేట్లు తగ్గించటం, కాంక్రీటు డ్యాం లేకుండా మట్టి మట్టికట్ట నిర్మాణం చేయటంతో, మొత్తంగా ఈ రోజు వరద ఉదృతికి, గేటు కొట్టుకుపోయింది. జలయజ్ఞంలో జరిగిన ధనయజ్ఞంలో భాగంగానే డిజైన్ మార్పులు నాశిరకం పనులు జరిగాయి. తండ్రిని అడ్డం పెట్టుకొని నాడు జగన్ రెడ్డి కమీషన్లు కొల్లగొట్టారు. ఆ పాపమే నేటి పులిచింతల దుస్థితి.
పులిచింతల పూర్తి చేసిన ఘనత వైఎస్ ది అని అక్కడ 45 అడుగుల వైఎస్ విగ్రహంతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని 07.10.2019న నీటి పారుదల శాఖా మంత్రి అనీల్ కుమార్ ప్రకటించారు. జగన్ రెడ్డి కూడా ఆ ఘనత తమదే అన్నారు. మరి పులిచింతల గేటు కొట్టుకుపోయిన పాపం పూర్తిగా జగన్ కుటుంబానిది కాదా?..