పులిచింతలలో భూకంపం.. ప్రాజెక్టుకు ప్రమాదం..?
posted on Aug 8, 2021 @ 12:46PM
ఓవైపు పులిచింతలపై రాజకీయ ప్రకంపణలు.. ఇదే సమయంలో పులిచింతల ప్రాంతంలో భూప్రకంపణలు.. ప్రకృతి పగ బట్టినట్టుంది. పులిచింతలతో ఆటాడుకుంటోంది. ఉన్నట్టుండి ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయింది. బంగారు పంటలు పండించాల్సిన జలం.. వృధాగా సముద్రం పాలైంది. చుట్టుపక్కల గ్రామాలను ముంపు భయంతో వణికించింది. పులి..చింతలకు రాజకీయ అవినీతే కారణమంటూ రచ్చ మొదలైంది. నాసిరకం పనులతోనే గేటు ఊడిందంటూ రగడ జరిగింది. ఆ పాపం మీదంటే మీదంటూ పార్టీలు నీళ్లెత్తి పోసుకుంటున్నాయి. ఆ నీటిమంటలు సలసల కాగుతుండగానే.. .పులిచింతల మరోసారి ఉలిక్కిపడింది. ఈసారి భూకంపం అందుకు కారణమైంది.
గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో భూప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం 7.15 గంటల నుంచి 8.20 గంటల వరకు భూమి కంపించినట్లు భూభౌతిక పరిశోధన ముఖ్యశాస్త్రవేత్త శ్రీనగేశ్ తెలిపారు. మూడు సార్లు భూమి కంపించినట్టు చెప్పారు.
భూకంపలేఖినిపై ప్రకంపణల తీవ్రత 3.0, 2.7, 2.3గా నమోదైనట్లు ఆయన వివరించారు. పులిచింతలతోపాటు తెలంగాణ పరిధిలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ భూ ప్రకంపలను వచ్చాయి. గత వారం రోజులుగా పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. భూకంపణాలతో పులిచింతల ప్రాజెక్టుకు ఏమైనా ప్రమాదం ఉందా అనే దిశగా అధికారులు అప్రమత్తం అయ్యారు.