అలుపెరగని అమరావతి పోరుకు ఫలితమెప్పుడు?
posted on Aug 8, 2021 @ 1:59PM
అది ఒక స్వప్నం.. మరొకరికి పీడకల. కొందరు సాకారం చేసుకోవాలని పోరాటం చేస్తున్నారు. ఆ స్వప్నాన్ని నలిపేయాలని అధికారంలో ఉన్నవారు ఆరాటపడుతున్నారు. ఆ పీడకల కనపడకుండా పోవాలని..కనుమరుగైపోవాలని.. కొత్తగా కలలు కంటున్నారు అధినేతలు. అది నీ వల్ల కాదు.. నీ తరం కాదు.. మా తరమే కాదు.. భావితరాలు కూడా పోరాడుతూనే ఉంటాయని.. సవాళ్లు విసురుతున్నారు ఆ ఉద్యమకారులు. ఎవరు గెలుస్తారో తెలియదు గాని.. ఆ పోరాటానికి 600 రోజులు నిండాయి. ఆరు వందల రోజుల నుంచి అలుపెరగకుండా వారు ఉద్యమిస్తూనే ఉన్నారు. అంతకంటే వేగంగా అణచివేత ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.
అమరావతి. అనుకున్నట్లే జరిగి ఉంటే.. అదో అద్భుత నగరం అయి ఉండేది. కాని జగన్మాయ ఫలించింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం ప్రతిపక్షంలో కూర్చుంది. అయినా ఆ స్వప్నం ఆగదనుకున్నారు.. ఎందుకంటే జగనన్న నేను ఇక్కడే ఉంటున్నా ఇల్లు కట్టుకుంటున్నా.. అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకే ఇక్కడ సొంతిల్లు లేదు. అందుకే జనం నమ్మారు. కాని జగన్ ఎప్పుడూ అమరావతి అనే పదాన్ని కూడా తన నోటితో ఉచ్ఛరించలేదన్న విషయాన్నిఎవరూ గమనించలేదు. ఎన్నికల ముందు ప్రచారంలో అయినా.. అధికారంలోకి వచ్చాక అయినా.. సరే ఎవరైనా ప్రశ్న వేస్తే ..ఆ ప్రశ్నలో అమరావతి ఉంది తప్ప.. ఈయన జవాబులో కుంభకోణం అనే వస్తుంది తప్ప అమరావతి అని ఎప్పుడూ ఇప్పటికీ అనలేదు. ఆఖరికి మూడు రాజధాను ప్రకటనలో సైతం.. ఇక్కడ అన్నాడే తప్ప.. అమరావతిలో శాసనరాజధాని అని అనలేదు.
అంతగా దానిపై ద్వేషాన్ని పెంచుకున్న జగన్.. ముందు అమరావతిలో పనులు ఆపేశారు. అవినీతి అంటూ విచారణ అన్నారు.. ఇప్పటివరకు ఏం తేల్చలేదు.. కాని పనులు ఆగిపోయాయి. అమరావతి ఆగిపోయింది. ఇక మూడు రాజధానుల ప్రకటన చేశాక అందరికీ క్లారిటీ వచ్చేసింది. అమరావతిని ఉంచరని.. దీంతో అమరావతికి తమ ప్రాణమైన భూములనే ఇచ్చేసి.. తమ భావి తరాలు బాగుపడతాయని ఆశపడ్డ రైతులు భగ్గుమన్నారు. డిసెంబర్ 17 2019న మొదలైన ఆ నిరసన.. నేటికీ సాగుతూనే ఉంది.
పొలం మట్టిలో ఆనందంగా వేసిన అడుగులు.. నడిరోడ్డుపై చెప్పులు కూడా లేకుండా కాళ్లు కాలేలా తిరుగుతున్నాయి. వ్యవసాయంలో చేదోడుగా ఉండి.. కమ్మగా వంట చేసే చేతులు పిడికిళ్లు బిగించి మరీ.. నడిరోడ్డుపై నిలబడ్డారు. వ్యవసాయం, భర్త, పిల్లలు.. పండగలు తప్ప ఇంకోటి ఎరుగని ఆ మహిళలు పోలీసుల లాఠీ రుచి చూడాల్సి వచ్చింది. రోడ్డుపై బూట్లతో తొక్కినా పడ్డారు. అరెస్టులు చేసి కులం పేరుతో దూషించినా.. భరించారు. కాని బిగిసిన ఆ పిడికిలి మాత్రం సడలలేదు. నినదించిన ఆ స్వరం మూగబోలేదు. అమరావతి రాజధానిగా కొనసాగితే తప్ప.. మండుతున్న ఆ గుండెలు చల్లారేలా లేవు. చెంబు, నీళ్లు తెచ్చి అద్భుత రాజధాని నిర్మిద్దామన్న పెద్దమనిషి మోదీ ఇప్పుడు అసలు ఇటే చూడటం లేదు. మాట కూడా మాట్లాడటం లేదు. మేం వస్తే ఇదే రాజధాని అంటున్నారు తప్ప...జగన్ చేసేది తప్పు అని మాత్రం బిజెపివారు అనటం లేదు. పోరాడతానన్న పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం అండగా నిలబడ్డాయి.
అమరావతి రైతులు మాత్రం కొడవలి లాంటి చేతులను ఎక్కుపెట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నారు. 600 కాదు 6000 రోజులైనా పోరాడతాం.. ఈ అమరావతిని రాజధానిగా చేసే వరకు వెనక్కు తగ్గేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఆ స్ఫూర్తిని అభినందించాల్సిందే... ఆ పోరాట పటిమను మెచ్చుకోవాల్సిందే.. అలాంటి పోరాటానికి అండగా నిలబడాల్సిందే. మళ్ళీ ఎన్నికలు జరిగి.. ఫలితాలొచ్చేవరకు .. ఈ పోరాట ఫలితం ఏంటో తెలిసే అవకాశమైతే లేదు.