భారత బాహుబలి.. ఆనంద్ మహీంద్రా బహుమతి ఇది..
posted on Aug 8, 2021 @ 12:18PM
ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి ప్రపంచ బాహుబలిగా నిలిచాడు నీరజ్ చోప్రా. ఈటె విసరడంలో భారతీయులకు సాటి మరెవరూ లేరని నిరూపించాడు. అందుకే, భళి భళిరా అంటూ నీరజ్‌ను బాహుబాలితో పోలుస్తోంది యావత్ భారతం. నీరజ్ చోప్రా జావెలిన్ విసిరే ఫోటోతో పాటు బాహుబలిలో ప్రభాస్ ఈటె విసిరే పిక్‌ను జత చేసి ఆసక్తికర ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. జస్ట్.. ట్వీట్ కాదండోయ్.. ఓ మాంచి బహుమతి కూడా ఇచ్చేశారు..
టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ బహుమతి ప్రకటించారు. తమ సంస్థ నుంచి కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న XUV 700 మోడల్ వాహనాన్ని అతడికి బహుమతిగా ఇవ్వనున్నట్టు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
‘‘మేమంతా నీ సైన్యంలో ఉన్నాం.. బాహుబలి’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈటెను విసురుతున్న నీరజ్ చోప్రా ఫొటోతో పాటు.. తన వెనక భారీ సైన్యంతో.. చేతిలో ఈటెను పైకెత్తి గుర్రంపై వస్తున్న ప్రభాస్ ఫొటోను షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు బదులిస్తూ నీరజ్‌కు XUV 700 బహుమతిగా ఇవ్వాలంటూ ఓ నెటిజన్ కోరాడు. అతడి ట్వీట్‌కు రిప్లైగా.. ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్ చేశారు. తన సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతోద్యోగులను ట్యాగ్ చేస్తూ.. నీరజ్ కోసం ఓ XUV 700 మోడల్ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలన్నారు. ఆనంద్ మహీంద్రా నిర్ణయాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు రీట్వీట్లతో అభినందిస్తున్నారు.