సీజేఐ సీరియస్ తో సీబీఐ దూకుడు... వైసీపీలో హైటెన్షన్
posted on Aug 8, 2021 @ 4:52PM
న్యాయవ్యవస్థను అస్సలు పట్టించుకోవట్లేదని, జడ్జిల ఫిర్యాదునూ లెక్క చేయట్లేదని సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ఘాటు వ్యాఖ్యల ప్రభావం కనిపిస్తోంది.సీజేఐ అసహనం వ్యక్తం చేయడంతో.. దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇలాంటి కేసుల్లో దూకుడు పెంచాయి. అరెస్టులు చేస్తున్నాయి. ఏపీలో జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పి. ఆదర్శ్, ఎల్. సాంబశివరెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
జడ్జీలపై వ్యాఖ్యల కేసులో ఇప్పటి వరకు ఏపీలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఈ కేసులో జులై 28న కొండారెడ్డి, సుధీర్.. జులై 9న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఎంపీ నందిగం సురేశ్, ఆమంచి కృష్ణ మోహన్ పాత్రను పరిశీలిస్తున్నామని సీబీఐ తెలిపింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. జడ్జీలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నట్లు పేర్కొంది
వైసీపీ అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ... సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా, విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే తాము గుర్తించిన 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎంపీ నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు.
జడ్జీలపై వ్యాఖ్యల కేసులో సీబీఐ వేగం పెంచడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా ఎంత మంది అరెస్టు అవుతారోనన్న ఆందోళనలో నేతలు ఉన్నారు. మరోవైపు జడ్జీలపై అసభ్య పదజాలంతో దూషించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ జనాల నుంచి వస్తోంది. అలా అయితేనే ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.