సాహో చోప్రా.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించెన్.. వందేళ్ల కల ఫలించెన్..
posted on Aug 7, 2021 @ 6:09PM
ఒలింపిక్స్‌లో భారత్ అద్భుతం చేసింది. అథ్లెటిక్స్‌లో వందేళ్ల స్వప్నం సాకారం చేసింది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించి.. నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. 130 కోట్ల భారతీయులను ఆనందంలో ముంచెత్తాడు. టోక్యో ఒలింపిక్స్‌ను మరుపురాని తీపి జ్క్షాపకంగా మార్చాడు.
జులపాల జుట్టుతో.. పదునైన బల్లెంతో.. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ప్రపంచంలోరనే తిరుగులేని ఆటగాడిలా నిలిచాడు. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు.
ముందే ఊహించారు. అంతా అనుకున్నారు. నీరజ్ చోప్రా పతకం తీసుకొస్తాడని. కానీ, ఏకంగా బంగారు పతకమే గెలుపొందడంతో ఆనందం ఆకాశాన్ని అంటుతోంది. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్ ఒలింపిక్స్ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్లో 12 మందితో పోటీ పడి.. జావెలిన్‌ను 87.58 మీటర్లు విసిరి.. ఒలింపిక్స్‌లో భారత పేరును, తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించాడు.
2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.
నీరజ్ 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. 2016 నుంచి నీరజ్ కెరీర్.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. ఆ ఏడాదిలో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఏడు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడంతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. నీరజ్ చోప్రాను చూసి గర్వ పడుతోంది.