ప్రకాశం వైసీపీలో వర్గపోరు.. చీరాలలో కరణం వర్గీయులపై దాడి
posted on Aug 8, 2021 @ 9:34AM
ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గ పోరు భగ్గుమంటోంది. మరోసారి అధికార పార్టీ కార్యాకర్తలు నడిరోడ్డుపైనా బాహాబాహీకి దిగారు. చీరాల నియోజకవర్గంలో వైసీపీలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. చీరాల మండలంలోని గవినివారిపాలెంలో మెగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే గ్రామానికి వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ శ్రేణుల మధ్య ఏర్పడిన వివాదం క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకుంది.
రెచ్చిపోయిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే, పోలీసులు సర్దిచెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. అధికార పార్టీ నేత బుర్ల మురళి ఈ ఘటనపై ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కొందరు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాంకృష్ణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలోనూ చాలా సార్లు రెండు వర్గాలు గొడవకు దిగాయి.
గత ఎన్నికల్లో ఆమంచి వైసీసీ నుంచి పోటీ చేయగా.. కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్రమంతై వైసీపీ గాలీ వీచినా.. చీరాలలో మాత్రం కరణం విజయం సాధించారు. అయితే తర్వాత కొన్ని రోజులకే కరణం వైసీపీ గూటికి చేరారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కరణం, ఆమంచి మధ్య సయోధ్యకు సీఎం జగన్ ప్రయత్నించినా కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరిందని అంటున్నారు.