బీజేపీ+టీడీపీ+జనసేన.. వైసీపీ షేక్.. ప్రభుత్వం పడిపోనుందా?
posted on Aug 7, 2021 @ 5:19PM
ఏదో జరుగుతోంది. ఏపీలో ఎవరూ ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్రంలో వేగంగా పావులు కదులుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పతనమయ్యేలా బలమైన సంకేతాలు బయటకు వస్తున్నారు. ఎప్పుడులేనిది.. ఏపీ మంత్రులు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. మునుపెప్పుడూ లేనివిధంగా వైసీపీ పెద్దలు కమలనాథులపై కస్సుమంటున్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలు జరుగుతున్నాయని మంత్రి పేర్ని నాని మీడియా ముఖంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకా అవసరం లేదంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దియోదర్‌లు వెంటనే స్పందించారు. ఇక, సీఎం జగన్ ఆంతరింగిక పెద్దమనిషి సజ్జల సైతం కేంద్రం-బీజేపీలపై చెలరేగిపోవడం.. అప్పుల తిప్పలపై రివర్స్ అటాక్‌కు దిగడంతో.. ఏపీలో ఏదో జరుగుతోందనే ప్రచారం ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకూ హోరెత్తుతోంది.
మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగింది. కాషాయం కప్పుకొన్న వ్యక్తిని సీఎంను చేయాలని బీజేపీ కలలు కంటోందంటూ బాంబు పేల్చారు. రాజకీయ పార్టీలు ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకోవడం మామూలే. బీజేపీ కూడా రాజకీయ పార్టీయే. ఎన్‌జీవో కాదు కదా.. అంటూ నాని మాట్లాడిన మాటలు మామూలుగా లేవు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే పేర్ని ఇలాంటి కామెంట్లు చేయడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రిమండలిలో ఆ మేరకు పెద్ద చర్చే జరిగిందంటున్నారు. జగన్ బెయిల్ రద్దు తప్పకపోవచ్చనే ఢిల్లీ వర్గాల సమాచారం వస్తుండటం.. అప్పులపై కేంద్రం సర్కారును మెలిపెడుతుండటం వల్లే.. ఇలా ఎదురుదాడికి దిగారని అంటున్నారు. గోతులు తవ్వడం.. ప్రభుత్వాన్ని కూల్చడం.. లాంటి డైలాగులు యధాలాపంగా వచ్చినవి కావని.. పక్కా చర్చ జరిగాకే ఇలా రచ్చ రాజేశారని చెబుతున్నారు.
మంత్రి పేర్ని నానితో ఆగిపోలేదు ఎదురుదాడి. బీజేపీకి యాంటీగా.. ముస్లిం నాయకుడితోనూ పదునైన విమర్శలు చేయించారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని, ఏపీలో బలం పెంచుకోవాలని బీజేపీ మత రాజకీయం చేస్తోందంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మరింత అలజడి రాజేశారు. ఇక సీఎం జగన్ షాడో సజ్జల సైతం ఈ కాంట్రవర్సీలో నోరు పెట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పని చేస్తున్నాయంటూ అగ్గిపుల్ల గీచి మరింత అగ్గి ఎగదోశారు. కేంద్రంపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ఏపీ అప్పులపై కేంద్ర జోక్యాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులెంతో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. అటు, పేర్ని నాని సైతం కేంద్రం అప్పులు చేయడం లేదా? అంటూ ప్రశ్నించడం.. మంత్రులు, వైసీపీ పెద్దలంతా పోలోమంటూ కేంద్రం-బీజేపీపై దాడికి దిగడం వెనుక జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే అనుమానం.
ఇప్పటికే ఏపీ అప్పుల చిట్టాపై కేంద్రం లెక్కలు అడుగుతోంది. కొత్త అప్పులు చేయకుండా చెక్ పెడుతోంది. ఇది ఏపీ సర్కారులో అసహనాన్ని కలిగిస్తోంది. అటు, జగన్ బెయిల్ రద్దు విషయంలోనూ కేంద్రం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్.. జగన్ పాలనపై కన్నెర్ర చేయడం.. కమలనాథులు పాత మిత్రుడు చంద్రబాబు విషయంలో సాఫ్ట్ కార్నర్‌తో ఉండటం.. ఇలా వరుస పరిణామాలను చూసి సీఎం జగన్ తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే, తాజా కేబినెట్ భేటీలో ఎదురుదాడికి వ్యూహరచన చేశారని చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్.. మంత్రులను గట్టిగా ఆదేశించారనే తెలుస్తోంది. ప్రతిపక్ష నేతల విమర్శలకు ఎందుకు మౌనంగా ఉంటున్నారని.. ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని.. మంత్రులను సీఎం నిలదీసినట్టు సమాచారం. అందుకే, జగన్ ఆదేశాల మేరకే పేర్ని నాని, అంజాద్ బాషాలతో పాటు సజ్జల సైతం రంగంలోకి దిగి.. కమలనాథులపై, కేంద్రంపై తోకతొక్కిన తాచుపాముల్లా బుసలుకొడుతున్నారని చర్చించుకుంటున్నారు. అయితే, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణ చేయడం అత్యంత కీలకాంశం. దాని అర్థం, పరమార్థం.. జగన్ బెయిల్ రద్దు కాబోతోందా? అనే అనుమానం.
వైసీపీ వాళ్లు ఇంతలా రెచ్చిపోతుంటే.. కాషాయ దళం మాత్రం చాలా కూల్‌గా ఆన్సర్ ఇస్తోంది. జగన్ సర్కారును కూల్చాసిన అవసరం తమకేమీ లేదని.. అలాంటి ప్రయత్నాలేవీ బీజేపీ చేయడం లేదంటూ సోము వీర్రాజు లైట్-మోడ్‌లో రిప్లై ఇచ్చారు. ఇక ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోదర్ చేసిన ట్వీట్ మరింత సంకేతం ఇచ్చేలా ఉంది. ఎప్పుడు బెయిల్ రద్దు అవుతుందో తెలీక, రోజు గడవడానికి అప్పు పుట్టక.. వేలకోట్ల అవినీతి చేసి.. మీ ప్రభుత్వానికి మీరే పాతాళం లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారంటూ.. వరుస ట్వీట్లతో సీఎం జగన్ పరువంతా తీసేశారు సునీల్ దియోదర్.
గతానికి భిన్నంగా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోతులు తీస్తున్నారని, కాషాయం కప్పుకున్న వ్యక్తిని సీఎం చేయాలని చూస్తున్నారని.. ప్రభుత్వంలోని వారే ఆరోపించడం తీవ్ర కలకలంగా మారుతోంది. జగన్ ప్రభుత్వం పతనం కాబోతోందనే సంకేతాలు అందడం వల్లే.. ఏపీ మంత్రులు, వైసీపీ పెద్దలు ఇంతలా అరిచి గోల పెడుతున్నారని అనుమానిస్తున్నారు. అది అప్పులపై కేంద్రం జోక్యమో.. లేక, అంతా అనుకుంటున్నట్టు జగన్ బెయిల్ రద్దు కాబోతోందనే భయమో.. కారణం ఏదైనా వైసీపీలో కలవరపాటు సుస్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మరి, ఈ రాజకీయ రచ్చ ఎంత వరకూ దారి తీస్తుందో చూడాలి...