600 అలజడి.. సంకెళ్లతో సమరాన్ని ఆపగలరా? ప్రభుత్వం పడిపోతే మంచిరోజులు రావా?
posted on Aug 8, 2021 @ 11:33AM
అమరావతి. నవ్యాంధ్ర కలల రాజధాని. అంతర్జాతీయ స్థాయి నగరం. ఆంధ్రుల నిండు గౌరవం. అలాంటి అమరావతితో మూడుముక్కలాట ఆడుకున్నారు పాలకులు. అద్బుత నగరంగా విలసిల్లాల్సిన రాజధానిని.. అడ్రస్ లేకుండా చేశారు. ప్రజలు వద్దంటున్నా.. హైకోర్టు కుదరదంటున్నా.. ప్రభుత్వం మాత్రం మంకు పట్టు వీడటం లేదు. అమరావతిని నాశనం చేసేవరకూ వదిలేది లేదంటూ సర్కారు పంతానికి పోతోంది. 33 గ్రామాలు, అక్కడి వారు చేసిన త్యాగాలు, కోట్లాది ప్రజల ఆకాంక్షలు.. అన్నిటినీ నిర్బంధంతో, కేసులు, కుట్రలు, కుతంత్రాలతో.. ఏపీ రాజధాని అమరావతిపై ఉక్కుపాదం మోపుతోంది సీఎం జగన్ రెడ్డి సర్కారు.
గోడకు కొట్టిన బంతిలా.. అమరావతి ప్రజలు జగన్‌రెడ్డి ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. అలుపు, సొలుపు లేకుండా 600 రోజులుగా ఉద్యమిస్తున్నారు. ధర్నాలు, దీక్షలు, నిరసనలు, విన్నపాలతో అమరావతి నినాదాన్ని వారి భుజాలపై మోస్తున్నారు. సీఎం జగన్ మారుతాడనే నమ్మకం వారిలో ఏ కోశాన లేదు.. జగన్ ప్రభుత్వం మారబోతోందనే ఆశనే వారిలో మరింత ఉత్సాహం నింపుతోంది. కేంద్రంలో వేగంఆ మారుతున్న పరిణామాలు, జగన్ బెయిల్ రద్దు తీర్పుతో.. అమరావతివాసుల్లో మనోధైర్యం పెరుగుతోంది. మళ్లీ మంచి రోజులొస్తాయనే నమ్మకంతో.. 600 రోజుల ఉద్యమాన్ని రెట్టింపు జోష్‌తో జరుపుతున్నారు.
అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరనున్న సందర్భంగా ’న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు హైకోర్టు వద్ద నిర్మాణంలో ఉన్న జడ్జిల క్వార్టర్స్ నుంచి ర్యాలీగా బయలుదేరి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించాలనేది షెడ్యూల్. అయితే, రాజధాని ప్రాంతంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదంటూ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఇనుప కంచెలు ఏర్పాటుచేశారు.
రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. పెదపరిమి దగ్గరే మీడియా ప్రతినిధుల వాహనాలను నిలిపివేశారు.
మరోవైపు విజయవాడ- అమరావతి మార్గంలోనూ అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై 4 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే విడిచిపెడుతున్నారు. పలు చోట్ల నిరసనలకు దిగిన అమరావతి ఉద్యమకారులు, టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
అమరావతిని అంతం చేసేందుకు వైసీపీ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటిని రైతులు ఓర్పుతో చేధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెదిరింపులు, అణిచివేత, అరెస్టులకు అదరం...బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు తెలిపారు.
‘‘రోడ్లను సయితం తవ్వేస్తూ అమరావతిని చంపేస్తామని ఆనందపడుతున్న జగన్ రెడ్డి గారూ! మీరు తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారు.. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులనే అంతిమ విజయం వరించబోతుంది’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.