రియల్ ‘నారప్ప’ సీన్.. దళిత ఉద్యోగితో కాళ్లు మొక్కించుకోవడంపై ఆగ్రహం..
posted on Aug 9, 2021 @ 4:23PM
శతాబ్దాలు మారుతున్నా కుల అహంకారం వదలడం లేదు. కుల తారతమ్యాలు సమాజాన్ని ఇంకా పీడిస్తూనే ఉన్నాయి. అగ్రకులాలు దళితులను ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి వెనకబాటుతనమే ఇతివృత్తంగా ఇటీవల రిలీజైన నారప్ప చిత్రం ప్రేక్షకాధరణ పొందింది. అందులో ఓ సీన్.. కుల దురమంకారానికి పరాకాష్టగా నిలుస్తుంది. నారప్పగా నటించిన వెంకటేశ్.. గ్రామంలోని ఇతర కులాల వారి కాళ్లపై పడి క్షమాపణలు అడిగే సీన్.. సమాజంలోని దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపుతుంది. ఇలాంటివి సినిమాల్లోనే ఉంటాయని అనుకోడానికి లేదు. నిజంగానూ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, కులం పేరుతో ప్రభుత్వ ఉద్యోగితో తన కాళ్లు మొక్కించుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఆ దారుణం వైరల్‌గా మారడంతో తీవ్ర దుమారం రేగుతోంది.
తమిళనాడు, కోయంబత్తూర్‌లోని అన్నూర్ పంచాయితీలో ముత్తుస్వామి పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి ఇటీవల భూముల వివరాల కోసం పంచాయతీకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న మహిళా ఉద్యోగితో దురుసుగా మాట్లాడాడు. ముత్తుస్వామి అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
రెచ్చిపోయిన గోపాలస్వామి దళితుడైన ముత్తుస్వామిని కులం పేరుతో తిట్టాడు. తన కాళ్లమీద పడి క్షమాపణ చెప్పాలని, లేకపోతే తన పలుకుబడితో ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరింపులకు దిగాడు. భయపడిన ముత్తుస్వామి.. గోపాలస్వామి కాళ్లు పట్టుకుని క్షమించమని కోరాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. సమాజంలో కుల దురంహకారానికి సాక్షంగా నిలుస్తోంది ఈ ఘటన.