బీజేపీ సర్పంచ్ కాల్చివేత.. చంపింది ఎవరంటే...?
posted on Aug 9, 2021 @ 8:13PM
వారికి బీజేపీ నాయకులే టార్గెట్. కాషాయ కండువా కప్పుకున్న వారంటే కళ్లమంట. భరతమాత కోసం.. దేశం కోసం నినదించడమే వారి ఆగ్రహానికి కారణం. సరిహద్దుల రక్షణ.. ఉగ్రమూకల ఏరివేత వారికి మింగుడు పడటం లేదు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉండటం.. టెర్రరిజం తోక కట్ చేస్తుండటం.. వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అందుకే, దేశం మీది కోపం.. మోదీ మీది ధ్వేషం.. స్థానిక బీజేపీ నేతల మీద చూపిస్తున్నారు ఉగ్రవాదులు. కశ్మీర్‌లో కమలనాథులే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, ఓ గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపడం కలకలం రేపుతోంది.
కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగారు. అనంత్‌నాగ్‌లో బీజేపీ కిసాన్ మోర్చా కుల్గాం జిల్లా అధ్యక్షుడు, ఓ గ్రామానికి సర్పంచ్ కూడా అయిన గులాం రసూల్‌దర్‌తో పాటు ఆయన భార్యను ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అనాగరిక చర్యంటూ మండిపడింది. గత జూన్‌లోనూ పుల్వామాలో బీజేపీ నేత, మున్సిపల్ కౌన్సిలర్ రాకేశ్ పండితను ఉగ్రవాదులు కాల్చి చంపడం.. ఇప్పుడు మరో కాషాయ నేతపై దారుణానికి ఒడిగట్టడంపై బీజేపీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి.
మరోవైపు.. స్వతంత్ర దినోత్సవం సమీపిస్తున్నందున కశ్మీర్‌లో పోలీస్ కూంబింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. అణువణువు గాలిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉగ్ర కార్యకలాపాలను కట్టడి చేసినట్టు పోలీసులు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే గులాం రసూల్‌దర్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపడం భద్రతా దళాలకు సవాల్‌గా మారింది.