ఒక పార్టీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించాం.. హెడ్ కానిస్టేబుల్ కామెంట్ల కలకలం..
posted on Aug 9, 2021 @ 11:17AM
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం సాధించింది వైసీపీ. నిజానికి 150కి పైగా అసెంబ్లీ వచ్చాయంటే వైసీపీ నేతలు కూడా నమ్మలేని పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఏపీ ఫలితం సంచలనమైంది. అదే సమయంలో ఎన్నికలపై అనేక అనుమానాలు వచ్చాయి. అప్పుడు టీడీపీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న బీజేపీ... ఏదో మాయ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేశారని కొందరు బహిరంగంగానే ఆరోపించారు. అంతేకాదు ఎన్నికల సంఘం వైసీపీకి అనుకులంగా నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు కూడా వచ్చాయి. పోలీస్ శాఖ కూడా అక్రమాల్లో పాలు పంచుకుందని టీడీపీ నేతలు ఆరోపించారు.
2019 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. శాఖలోని కొందరి సహకారంతో తపాలా ఓట్ల వివరాలను సేకరించి ఓ పార్టీకి ఇచ్చామంటూ ప్రకాశం జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హెడ్ కానిస్టేబుల్ కామెంట్లతో ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు బలపడుతున్నాయి.
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో జులై 30న ఒంగోలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించిన కొందరు అధికారులు, సిబ్బంది కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనికి ప్రణీత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే ఇతర అధికారుల సమక్షంలోనే హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తపాలా బ్యాలెటు ఓట్ల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనతోపాటు మల్లారెడ్డి, కోటిరెడ్డి, సుబ్బారావు, వేణు, హోంగార్డు కిషోర్, ఓ మహిళా కానిస్టేబుల్ కలిసి జిల్లా వ్యాప్తంగా 700కుపైగా పోస్టల్ బ్యాలెట్ల వివరాలు సేకరించి పార్టీకి ఇచ్చామని, తమ కృషిని గుర్తించి మేలు చేయాలని కోరారు.
అంతేకాదు గత త ప్రభుత్వంలో ఉన్న వారే ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారని చెప్పిన వెంకటరెడ్డి.. ఈ విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, మీరైనా న్యాయం చేయాలని ప్రణీత్‌రెడ్డిని కోరారు. ఒకే పార్టీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించాంటూ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో స్పందించిన జిల్లా ఎస్పీ మలికా గార్గ్ అతడిని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.