ఫోన్లు చాలు.. ఇక నజరానాలు ఇవ్వండి.. మోదీకి రాహుల్ ఝలక్..
posted on Aug 9, 2021 @ 1:52PM
ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఈసారి అద్భుత ప్రదర్శనే కనబరిచారు. ఏడు పతకాలతో టోక్యోలో త్రివర్ణ పతాకం రెపరెపలాడించారు. అథ్లెటిక్స్‌లో 120 ఏళ్ల లోటును తీరుస్తు.. ఏకంగా స్వర్ణం సాధించి యావత్ దేశంలో ఉత్సాహం నింపారు నీరజ్ చోప్రా. ఏడు పతకాలు.. వేటికవే ప్రత్యేకమే. విశ్వ క్రీడల్లో భారతీయుల ప్రతిభకు నిదర్శనాలే.
ఇలా ఒలింపిక్ మెడల్ రాగానే.. అలా ప్రధాని మోదీ నుంచి ఫోన్ కాల్ వెళ్లేది. పతకం సాధించిన ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించే వారు మోదీ. మీ ప్రతిభ అద్భుతమని.. దేశానికి గర్వకారణమని.. ప్రశంశించేవారు. కొందరు ఓడిన వారికీ ఫోన్ చేసి.. నిరుత్సాహం వద్దంటూ.. ఓడినా పోరాడారంటూ.. ప్రోత్సహించారు ప్రధాని. ఇక ట్వీట్ల సంగతి సరేసరే. మోదీ చొరవను అంతా శభాష్ అంటూ కొనియాడారు. ప్రధానమంత్రే స్వయంగా ఫోన్ చేసి ఒలింపిక్స్‌లో గెలిచిన వారిని అభినందించడం.. ఓడిన వారిని ఓదార్చడం.. మోదీ ఇమేజ్‌ను మరింత పెంచింది.
ఇంత వరకూ బాగానే ఉంది. మోదీ మంచి పనే చేశారు. అంతేనా? ఇంకేం లేదా? అంటూ తాజాగా రాహుల్‌గాంధీ కొత్త చర్చ లేవనెత్తారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మోదీని గిల్లేలా ఘాటైన కామెంట్లు చేశారు.
‘క్రీడాకారులకు చేసిన ఫోన్లు చాలు.. ఇక నగదు బహుమతులు ఇవ్వండి. శుభాకాంక్షలతో పాటు నగదు బహుమతులు కూడా వారికి అందాలి.. క్రీడలకు కేటాయించిన నిధుల్లో కోత కాదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా ప్రధాని పేరు ప్రస్తావించకున్నా.. ఆ కామెంట్లు మోదీని ఉద్దేశించి చేసినవేనని అందరికీ తెలిసేలా పోస్టు పెట్టారు.
ఇన్‌స్ట్రా పోస్టుతో పాటు.. ‘‘4 ఏళ్ల గడిచినా హరియాణ అథ్లెట్లకు అందని నగదు బహుమతులు’’ టైటిల్‌తో టైమ్స్ ఆఫ్ ఇండియాలో జులైలో వచ్చిన స్టోరీ క్లిప్పింగ్‌ను సైతం తన పోస్టుకు జత చేశారు రాహుల్‌గాంధీ. వార్తా కథనంలో.. గతంలో వివిధ టోర్నీలలో, వివిధ ఆటగాళ్లకు హరియాణ ప్రభుత్వం ప్రకటించిన నజరానాలు.. ఎవరెవరికి ఎంతెంత క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారో ఆ వివరాలతో పాటు అవి ఇప్పటికీ అందని వైనాన్ని ఆ కథాంశంలో డిటైల్‌గా రాసుకొచ్చారు. ఆ హరియాణ ఎపిసోడ్‌ను గుర్తు చేస్తూ.. మోదీని టార్గెట్ చేసేలా.. ఆటగాళ్లకు ఫోన్లు చాలు.. నగదు బహుమతులు ఇవ్వాలంటూ రాహుల్‌గాంధీ డిమాండ్ చేయడం చర్చనీయాంశమవుతోంది.