ఇంద్రవెల్లి దండోరా.. రేవంత్‌రెడ్డి గర్జన.. కాస్కో కేసీఆర్..
posted on Aug 9, 2021 @ 12:23PM
క్విట్ ఇండియా మర్నాడే.. క్విట్ కేసీఆర్ సమరశంఖాన్ని పూరించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభతో గులాబీబాస్‌కు రేవంత్ సత్తా తెలిసొచ్చేలా చేశారు. ఉదయం నుంచి ఒకటే హంగామా. బండెనక బండి కట్టి.. ఇంద్రవెల్లికి దండు కట్టి.. దళితులు, గిరిజనుల పక్షాన దండోరా మోగించారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాడుతున్నారు.
అది సభ కాదు. జన ప్రభంజనం అనేలా భారీ ఏర్పాట్లు. కాంగ్రెస్ ప్రముఖులంతా తరలివచ్చే తరుణం. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి సత్తాకు నిదర్శనం. 18 ఎకరాల స్థలం. లక్ష మంది జనం. లెక్క పెట్టుకో కేసీఆర్.. ఒక్కరు తక్కువైనా దేనికంటే దానికి సై.. అంటూ ముందే సవాల్ చేశారు చిచ్చరపిడుగు. అన్నట్టుగానే.. అన్ని జిల్లాల నుంచి.. జనం.. చీమలదండులా కదిలారు.
హైదరాబాద్ నుంచి ర్యాలీగా రేవంత్‌రెడ్డి. దారిపొడువునా జన జాతరే. జై కాంగ్రెస్.. జై రేవంత్.. నినాదాలే. అడుగడుగునా కాంగ్రెస్ జెండా రెపరెపలే. కాంగ్రెస్‌లో మునుపెన్నడూ చూడని ఉత్సాహం. గత వైభవం దిశగా హస్తం పార్టీ అడుగులు. ఇంతటి జోష్ రేవంత్‌రెడ్డి వల్లే సాధ్యం.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ. దళితబంధుతో కేసీఆర్ చేస్తున్న రాజకీయ డ్రామాకు దండోరాతో దుమ్ముదులిపేయనున్నారు రేవంత్‌రెడ్డి. జీతాలకే డబ్బులు లేక భూములు అమ్ముకున్న సర్కారు.. లక్ష కోట్లతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నిటికీ 10 లక్షలు ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? దళితుడికి డిప్యూటీ సీఎం, దళితులకు 3 ఎకరాల భూమి.. లానే దళిత బంధును రాజకీయ పబ్బం కోసం వాడుకుంటున్నారనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికే ఈ దళిత దండోరా. తెలంగాణలో దళితులు మాత్రమే ఉన్నారా? పాపం.. గిరిజనులు,. అభంశుభం తెలీని అడవి బిడ్డల.. దుస్థితి అంతకన్నా దారుణం. వారి అభివృద్ధి మాటేంటి? పోడు భూములు సమస్యకు పరిష్కారమేంటి? తెలంగాణలో గిరిపుత్రులను ఆదుకోరా? వారి అభ్యున్నతికి కృషి చేయరా? అందుకే గిరిజన దండోరా. ఇంద్రవెల్లి గడ్డ మీద నుంచి.. రేవంత్‌రెడ్డి చేస్తున్న దళిత-గిరిజన దండోరా.
ప్రగతిభవన్‌లో ప్రకంపణలు వచ్చేలా.. కేసీఆర్‌ను బయటకు గుంజేలా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి వేదికగా సమరశంఖం పూరిస్తున్నారు. దళిత గిరిజన దండోరాతో గులాబీ బాస్‌లో గుబులు రేపుతున్నారు. లక్ష.. అక్షరాల లక్ష మంది జనంతో.. ఇంద్రవెల్లి.. ఈ రాజకీయ ఇంద్రుడి సత్తాకు సాక్షంగా నిలుస్తోంది. జనాన్ని లెక్కేసుకో కేసీఆర్.. రేవంత్‌రెడ్డి దెబ్బను కాస్కో కేసీఆర్..