ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. స్కూల్ ఆవరణలో రాజకీయాలా? జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్..
posted on Aug 9, 2021 @ 3:40PM
మూడు కేసులు.. ఆరు చివాట్లు. ఇది ఏపీలో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి సర్కార్ కు హైకోర్టులో ఎదురవుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా కేసుల్లో జగన్ సర్కార్ విధానాలను తప్పుపడుతూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చాలా నిర్ణయాలను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రభుత్వమే మార్చేసుకుంది. పలు కేసుల్లో అధికారుల తీరుపైనా అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఐఏఎస్ లపైనా చర్యలకు దిగింది. అయినా జగన్ సర్కార్ తీరు మారడం లేదు. అధికారులు నిర్లక్ష్యం వీడటటం లేదు. దీంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్‌లు, పంచాయితీ ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్వేది, కమిషనర్ గిరిజా శంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మీ, ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ స్కూలు ఆవరణలో భవనాలు నిర్మించవద్దని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించలేదంటూ ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల భవనాల్లో రైతు భరోసా, పంచాయితీ భవనాలు, గ్రామ సచివాలయ నిర్మాణాలపై కోర్టు ధిక్కారణ కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని...ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని కోర్టు వ్యాఖ్యానించింది. పేద పిల్లలు చదువుకునే స్కూల్స్‌లో వాతావరణ కలుషితం చేస్తున్నారని ధర్మాసనం మండిపడింది.
తమ ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడంలేదని నలుగురు ఐఏఎస్ లను నిలదీసింది ధర్మాసనం. తమ ఆదేశాలను అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘మీలో ఏవరైనా ఈ పాఠశాలల్లో చదువుకున్నారా’ అని హైకోర్టు జడ్జి దేవానంద్ ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల ఆవరణలోకి రాజకీయాలను ఎలా తీసుకెళ్తారని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఆగస్టు 31కి వాయిదా కోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నివేదిక ఇస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.