20 నెలల తర్వాతే చిప్పకూడే.. కేసీఆర్ ఫ్యూచర్ చెప్పిన రేవంత్
posted on Aug 9, 2021 @ 7:44PM
ఇంద్రవెళ్లి వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గర్జించారు. దళిత, గిరిజన దండోరా సభలో కేసీఆర్ సర్కార్ పై దండోరా మోగించారు. కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచి తరిమేసేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చాడని మండిపడ్డారు. కేసీఆర్ కథ ముగిసిందని, 20 తర్వాత ఆయన చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ నియంత పాలనలో నిజాంను మించిపోతే.. అప్పటి ఖాసిం రజ్వీ కన్న ఘోరంగా ప్రభాకర్ రావు వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క దెబ్బకు వంద దెబ్బలు కొడతామని చెప్పారు. అన్ని డైరీలో రాసి పెట్టుకుంటున్నామని, లెక్కకు లెక్క సరి చేస్తామని తెలిపారు. పోలీసులు ప్రభుత్వానికి బానిసలుగా కాకుండా చట్టప్రకారం నడుచుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.
హుజురాబాద్ ఉపఎన్నికలు వస్తున్నాయని దళిత బంధు తీసుకొచ్చాను అంటూ సీఎం కేసీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 70 ఏండ్ల కాంగ్రెస్ చరిత్ర.. ఏడేళ్ల కేసీఆర్ నేరాలు ఘోరాలు చూడాలంటూ చురకలు వేశారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తాను అంటున్నారని.. తాను మఠం నడపడం లేదు.. రాజకీయ పార్టీ నడుపుతున్నా అంటూ కేసీఆర్ నిస్సిగ్గుగా, భరితెగించిన మాటలు మాట్లాడుతున్నారని.. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడలేదని విమర్శించారు. అందుకే దండుగట్టి.. దళిత దండోరా పెట్టి.. 118 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అప్పుడైనా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అందుకే కాంగ్రెస్ యువనేతలు, యువకులు ఏకతాటిపైకి వచ్చి.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇస్తాడా.. సస్తాడా అనేది తేల్చుకునేలా చేయాలన్నారు
దళిత సోదరులకు అండగా ఉంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. దళితుడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఉపఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని, కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని విమర్శించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు తోడు, నీడగా ఉంటానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సమైక్యపాలనలో అడవి బిడ్డలను కాల్చేస్తుంటే... ఈ ప్రాంత నేతలు నిస్సహాయులుగా నిలిచిపోయారని ఆరోపించారు.