పీకే బీజేపీ సంధించిన బాణమా? కారు, కాంగ్రెస్‌లకు చిక్కేనా?
posted on Aug 9, 2021 @ 5:35PM
షర్మిల పార్టీ పెట్టారు. జగనన్న వదిలిన బాణమన్నారు. బీజేపీ ఏజెంట్ అని ఆడిపోసుకున్నారు. ఆరోపణలు ఎలా ఉన్నా.. ఆమె తన పని తాను చేసుకుపోతున్నారు. లేటెస్ట్‌గా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్‌కి రిజైన్ చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బీఎస్సీలో చేరి కేసీఆర్‌పై దండయాత్ర స్టార్ట్ చేశారు. ఏనుగుపై ప్రగతిభవన్‌కు వస్తామంటూ సవాల్ చేశారు.
కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకుంటారా? దళిత ఎమ్మెల్యేతో ఎదురుదాడి ప్రారంభించింది గులాబీదళం. ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్ వీఆర్‌ఎస్ తీసుకున్నారంటూ ఆరోపించింది. కేవలం మమ్మల్నే తిడతారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నించరా? అంటూ అటాక్ చేస్తోంది. మరో అడుగు ముందుకేసి.. ప్రవీణ్‌కుమార్ అలియాస్ పీకే.. బీజేపీ మనిషంటూ ప్రకటించేశారు.
'బీజేపీ ప్రయోగిస్తున్న కుట్రలో భాగంగానే ప్రవీణ్‌కుమార్ వస్తున్నారు. వాళ్లు పావుగా వాడుతున్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను విచ్ఛినం చేసే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రవీణ్‌కుమార్ గ్రహించాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శించారు. టీఆర్ఎస్ చేసిన ఈ ఆరోపణ సంచలనంగా మారింది. నిజమేనా? అనే అనుమానమూ వ్యక్తమవుతోంది.
'ఒక్క రూపాయి దళితుల కోసం పని చేయకుండా, ఇస్తామన్న ఉద్యోగులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు. ఎందుకంటే, ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉండి, ఇష్టం వచ్చిన ప్రమాణాలు చేయించి, ఇష్టారీతిగా వ్యవహరిస్తే కేసులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఉద్యోగం ఉంటుందో, పోతుందోనన్న భయాందోళనతో.. జాతి కోసం బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు బహుజన్ సమాజ్‌పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా అంటే, ఏమవుతోందనన్న భయం ఆయనలో ఉంది' అంటూ కలకలం రేపారు ఎమ్మెల్యే కిశోర్.
'గతంలో చాలా మంది అధికారులు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఇలాంటి పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల కోసం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. దళిత బంధులాంటి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు. త్వరలోనే మీకు కనువిప్పు కలుగుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చి కారు విజయం తథ్యం' అని కిషోర్ అన్నారు.
టీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టే.. పీకే.. మోదీని కానీ, బీజేపీని కానీ ఒక్క మాట కూడా అనలేదు. బీఎస్పీ జాతీయ స్థాయిలో బీజేపీతో సన్నిహితంగా రాజకీయం నెరుపుతుంటుంది. కానీ, ప్రవీణ్‌కుమార్‌పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఉంది. ప్రస్తుతానికైతే ఆయన వెనుక ఉన్నదంతా దళిత వర్గమే. ఆ లెక్కన బీజేపీకి పడే ఏ ఒక్క ఓటు కూడా బీఎస్పీకి పడే అవకాశమే లేదు. పీకే వైపు మళ్లేదంతా టీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకే అంటున్నారు.
ఏళ్లుగా దళితులు కాంగ్రెస్ వెంట ఉన్నారు. తాజాగా దళిత బంధుతో ఆ వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. మధ్యలో ప్రవీణ్‌కుమార్ ఎంట్రీతో దళితులతో మూడు ముక్కలాట మొదలవుతుంది. తమకు పడని ఓట్లు.. ఏ ఒక్క పార్టీకీ పడకుండా.. వాటిని విచ్చిన్నం చేయడం వల్ల.. అందరికంటే బీజేపీకే ఎక్కువ లాభం అంటున్నారు. ఇక బీసీలు.. టీడీపీ మినహా ఫలానా పార్టీకి మద్దతుదారులనే విధంగా కేంద్రీకృతమై లేరు. ప్రవీణ్‌కుమార్ పొలిటికల్ ఎంట్రీతో ఇకపై బహుజనులు కీలకంగా మారనున్నారు.
మరి, బహుజన రాజ్య స్థాపన కోసమే పీకే బీఎస్పీలో చేరారా? ఆయన బీజేపీ సంధించిన బాణమా? ప్రాంతీయ పార్టీలను కమ్మేసే ప్రయత్నమా? ఒక్క ప్రవీణ్‌కుమార్‌తో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ప్రమాదంలో పడనుందా? పీకేది సంకల్పమా? బీజేపీ చాణక్యమా? కాలమే క్లారిటీ ఇవ్వాలి...