నంద్యాలలో జర్నలిస్ట్ దారుణ హత్య.. అవినీతిని వెలికితీయడమే పాపమా?
posted on Aug 9, 2021 @ 12:23PM
ఆంధ్రప్రదేశ్ లో మరో అరాచకం జరిగింది. ప్రశ్నించే గొంతుక దారుణ హత్యకు గురైంది. కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో కిరాతకం హత్య జరిగింది. యూట్యూబ్ ఛానల్ విలేకరి కేశవులను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది.
మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం కేశవ వారం కిందట గుట్కా వ్యాపారితో టూటౌన్ కానిస్టేబుల్ సుబ్బయ్యకు సంబంధాలు ఉన్నాయని బయటపెట్టారట. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా.. జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ సుబ్బయ్యను సస్పెండ్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న కానిస్టేబుల్ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్ కాలనీలోని ఆటోస్టాండ్ వద్దకు పిలిపించారట.
కేశవ తోటి రిపోర్టర్ ప్రతాప్‌తో కలిసి ఎన్జీవోస్ కాలనీకి వెళ్లారు. అక్కడ కేశవతో మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని ఓ గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ చనిపోయాడు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు గుర్తించారు. కానిస్టేబుల్ అవినీతిని బట్టబయలు చేసిన విలేకరిని హత్య చేశారని జర్నలిస్ట్ సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ అన్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన రిపోర్టర్ కేశవ్ హత్య ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు డిజిపి గౌతమ్ సవాంగ్. హత్య కు పాల్పడిన నింధితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ కి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ తో పాటు హత్య తో ప్రమేయం ఉన్న అందరినిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఏపీ డిజిపి.