లైట్ తీసుకున్నారా.. రాజకీయ వ్యూహమా? పీకే చేరికకు మాయావతి ఎందుకు రాలేదు?
posted on Aug 9, 2021 @ 3:13PM
తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. నేతల వలసలు జోరందుకున్నాయి. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ వాదీ పార్టీలో చేరారు. కొన్ని రోజుల క్రితమే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. బహుజన వాదంతో ముందుకు వెళుతున్న ప్రవీణ్ కుమార్ కు రాష్ట్ర వ్యాప్తంగా అనుచర వర్గం ఉందని చెబుతున్నారు. ఆయన సారథ్యంలో నడుస్తున్న స్వేరోస్ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఉన్నాయి. దీంతో ప్రవీణ్ కుమార్ రాజకీయ అడుగులపై జనాల్లో ఆసక్తి నెలకొంది.
నల్గొండలో నిర్వహించిన రాజ్య సంకల్ప సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీ కుండువా కప్పుకున్నారు. అయితే ఆయన చేరిక కార్యక్రమం బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో జరగకపోవడం పలు చర్చలకు తావిస్తోంది. ప్రవీణ్ కుమార్ కు బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ఆ పార్టీ కండువాను కప్పి సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్‌కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు సభలోనే ఆయన ప్రకటించారు. రిటైర్డ్ ఐపీఎస్, బహుజనుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నట్లుగా చెప్పుకుంటున్న ప్రవీణ్ కుమార్ చేరిక కార్యక్రమానికి మాయవతి రాకపోవడంతో.. ఆమె అతన్ని లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ కొన్ని వర్గాల నుంచి వస్తోంది. ప్రవీణ్ కుమార్ తో పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదని భావించడం వల్లే రాంజీ గౌతమ్ ను పంపించారా లేక ఇతరత్రా రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది.
నిజానికి ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీఎస్పీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. గతంలో అధికారం చేపట్టిన యూపీలోనూ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరో ఆరేడునెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా మాయావతి ఇంకా జనంలోకి రాలేకపోతున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చర్యలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రాల్లో పార్టీకి బలం పెరిగితే ఎంతో ఉపయోగం. ఉద్యమ చరిత్ర ఉన్న తెలంగాణలో బహుజన వాదం బలంగానే పనిచేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ ప్రవీణ్ కుమార్ లాంటి బలమైన నేత పార్టీలోకి వస్తున్నా.. మాయావతి రాకపోవడంపై రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రవీణ్ కుమార్ ,మాయావతి కాంబినేషన్ విషయంలో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. మాయావతి అనుసరిస్తున్న రాజకీయ పంథాకు, ప్రవీణ్ కుమార్ ప్రకటిత పంథాకు మధ్య చాలా చాలా దూరం ఉన్నట్లు కనిపిస్తోంది. మాయావతి, ఇంతవరకు నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, రెండుసార్లు, బీజేపీ మద్దతుతోనే గద్దె నెక్కారు. అంతే కాదు ఇప్పుడు కూడా బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన సంకేతాలు కనిపిస్తున్నాయి.ఓబీసీ జనగణన చేపడితే, పార్లమెంట్ లోపలా వెలుపలా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమని ఆమె ప్రకటించారు. అలాగే, ప్రస్తత పార్లమెంట్ ప్రతిస్తంభన వ్యవహారంలోనూ బీఎస్పీ ఎంపీలు, కాంగ్రెస్ ఇతర విపక్షాల మొండి వైఖరిని తప్పుపడుతున్నారు. మాయావతి అనుసరిస్తున్నఈ బీజేపీ, హిందుత్వ అనుకూల వైఖరిని కరడు కట్టిన హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్న ప్రవీణ కుమార్ ఎంతవరకు జీర్ణం చేసుకుంటారన్నది అనుమానమే.
తెలంగాణలో ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా గతంలో హిందూ సంస్థలు, బీజేపీ తీవ్రంగా మండిపడ్డాయి. ముఖ్యంగా ఓ కార్యక్రమంలో ఆయన ప్రతిజ్ఞ చేయడం తీవ్ర దుమారం రేపింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రవీణ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రవీణ్ కుమార్ కరుడుగట్టిన హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసుకోగా.. అటు వైపు మాత్రం మయావతి బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమని చెబుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదిరినా కుదరొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ప్రవీణ్ కుమార్ చేరిక కార్యక్రమానికి మాయావతి రాలేదంటున్నారు. బెహన్ జీకి యూపీనే అత్యంత కీలకం కాబట్టి.. ఆ దిశగానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ల మద్దతు తీసుకోవడం ఆమెకు అవసరం ఉండదనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. అందుకే అన్ని అలోచించే ప్రవీణ్ కుమార్ విషయంలో.. మాయావతి అడుగులు వేశారని చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ ప్రయోగం ఎందుకనో సక్సెస్ కాలేదు. 1994 ఎన్నికల సముయంలో స్వయంగా కాన్షీ రామ్ హైదరాబాద్ లో మకాం చేసి, పార్టీని పటిష్ట పరిచేందుకు చాలా గట్టి కసరత్తే చేశారు. 1993 యూపీ ఎన్నికల్లో 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా బీఎస్పీకి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత 1995లో తొలి సారిగా బీజేపీ మద్దతుతో మాయావతి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. యూపీ తర్వాతగా ఏపీ అనే నినాదంతో 1994 ఎన్నికలకు ముందు రాష్ట్రలో దళిత బహుజనుల జెండా పాతేందుకు కాన్షీ రామ్ చేసిన ప్రయత్నాలకు ప్రజలనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కూడా కాన్షీరామ్ ఎవరి కొంప ముంచుతారో అని లెక్కలు వేసుకున్నాయి. హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో కాన్షీ రామ్ నిర్వహించిన భారీ బహిరంగ సభ, రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందన్న భ్రమలను సృష్టించింది. కానీ కాన్షీ రామ్ ప్రభంజనం ఫలితాలలో కనిపించలేదు. ఆ ఎన్నికలలో నిజమైన ప్రభంజనం ఎన్టీఅర్ సృష్టించారు. మొత్తం 294 స్థాన్లాకు గానూ 220కి పైగా స్థానాలలో తెలుగు దేశం విజయ దుందుభి మోగించింది. అలా 1994 ప్రయోగం ఫెయిల్ అయిన తర్వాత, రాష్ట్రంలో బీఎస్పీ ఉందంటే ఉందనే గానీ, బలమైన శక్తిగా మాత్రం లేదు. కత్తి పద్మారావు వంటి కొదంరు పార్టీని బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది.