రఘురామ ఫిర్యాదుపై రాష్ట్రపతి యాక్షన్.. వాళ్లిద్దరికి మూడినట్టేనా?
posted on Aug 9, 2021 @ 12:23PM
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కొంత కాలంగా పోరాడుతున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం జగన్ నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఫిర్యాదులు చేశార. ఎంపీ రఘురామ రాజుఫిర్యాదులపై ఢిల్లీలో సత్వర స్పందన లభిస్తోంది.
ఏపీ సీఎం జగన్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిల ఆర్థిక అక్రమాలు, సీబీఐ కోర్టులో పెండింగులో ఉన్న ఛార్జ్ షీట్ల గురించి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు జూలై 26న లేఖ రాశారు ఎంపీ రఘురాజు లేఖ. దీనిపై రాష్ట్రపతి స్పందించారు. ఈ అంశాన్ని సంబంధిత శాఖలకు పంపినట్టు రాష్ట్రపతి భవన్ నుంచి రఘురాజుకు అధికారికంగా లేఖ వచ్చింది. ఈ విషయాన్ని ఎంపీ రఘురామ రాజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.'గౌరవ రాష్ట్రపతికి జగన్, విజయసాయిరెడ్డిల ఆర్థిక అక్రమాలు, వారిపై సీబీఐ కోర్టులో ఉన్న పెండింగ్ ఛార్జ్ షీట్లపై నేను పంపిన పూర్తి నివేదికను... పరిశీలించాలని సంబంధిత శాఖలకు పంపించారు' అని అందులో ఆయన తెలిపారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన లేఖను షేర్ చేశారు.
అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురాజు పిటిషన్లు వేశారు. దీనిపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈనెల25 తీర్పు రాబోతోంది. జగన్ కు బెయిల్ రద్దు కావడం ఖాయమని చెబుతున్నారు రఘురామ కృష్ణం రాజు. జగన్ బెయిల్ కేసులో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీలోనూ కనిపిస్తోందని చెబుతున్నారు. మొత్తానికి కోర్టు కేసులు, కేంద్రానికి ఫిర్యాదులతో వైసీపీతో పాటు సీఎం జగన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.