షర్మిల భర్తతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ! అసలు కథ పెద్దదే..
posted on Aug 9, 2021 @ 3:54PM
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు... ఇటీవలే కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలతో సమావేశమైన ఫోటో వైరల్ గా మారింది. తమ పార్టీలోకి కీలక నేతలు వస్తున్నారంటూ షర్మిల పార్టీ నేతలు చెబుతున్న సమయంలోనే ఈ ఫోటో బయటికి రావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తోంది షర్మిల. అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆమె భర్తను కలిస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. తెలంగాణలోనూ అదే జరిగింది. కేసీఆర్ కు షాకిచ్చి ఎమ్మెల్యే షర్మిల పార్టీలోకి జంపు కానున్నారనే ప్రచారం జరిగింది.
వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆదివారం భేటి అయినట్లు ప్రచారం జరిగింది. వాళ్లిదరు మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ భేటి లోటస్ పాండ్ లో కాకుండా వేరే ప్రాంతంలో జరిగినట్లు కూడా ప్రచారం జరిగింది. కొద్దిరోజులుగా బ్రదర్ అనిల్ తో రాజయ్య తరచూ భేటి అవుతున్నారనే సమాచారం లీకైంది. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో రాజయ్య అసంతృప్తిగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ తొలి కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాజయ్య. అయితే కొన్ని రోజులకే ఆరోపణలతో రాజయ్య తొలగించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. రాజయ్య, శ్రీహరి ఇద్దరికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గమే. ఇద్దరికి మొదటి నుంచి విభేదాలున్నాయి.
ఇటీవల కాలంలో రాజయ్య, శ్రీహరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇరు వర్గాల నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్నారు. అదే సమయంలో కడియంకు సీఎం కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల వరంగల్ వెళ్లిన కేసీఆర్.. కడియం నివాసంలోనే లంచ్ చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజయ్యను తప్పించి కడియంకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు భర్తతో రాజయ్య సమావేశం అయ్యారంటూ ఫోటోలు బయటికి రావడం చర్చనీయాంశంగా మారాయి.
తనపై వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య క్లారిటీ ఇచ్చారు. అనిల్ తో కలిసి ఉన్న ఫోటోలు పాతవని, గతంలో తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో కావాలనే వైరల్ చేశారని ఆయన చెప్పారు. తాను లోటస్ పాండ్ కు వెళ్లలేదని.. బ్రదర్ అనిల్ ను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. పాత ఫొటోలతో పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని రాజయ్య హితవు పలికారు. అసత్య ప్రచారాలు చేసి మనసు గాయపరచవద్దని రాజయ్య విన్నవించారు.
పార్టీ మార్పుపైనా స్పష్టతనిచ్చారు రాజయ్య. జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పారు. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా కేసీఆర్ తనకు భిక్ష పెట్టారన్నారు. మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేకపోయారు కాబట్టే కేసీఆర్ దళిత ఎంపవర్ మెంట్ తెచ్చారని రాజయ్య తెలిపారు. రాజయ్య ఫొటోల ప్రచారం వెనుక ఆయన ప్రత్యర్థి. టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఉన్నారన్న ప్రచారంపై కూడా స్పందించారు. ‘కడియం శ్రీహరి నేను ఒకే జాతి బిడ్డలం.. అందుకే మా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఆయన రెండు సార్లు గెలిస్తే.. నేను నాలుగు సార్లు గెలిచా.. కొన్ని విషయాల్లో నేను కడియం శ్రీహరిని ఆదర్శంగా తీసుకుంటా.. అందుకే నేను గురువును మించిన శిష్యుడనయ్యా’ అంటూ కడియంతో తనకు విభేదాలపై రాజయ్య క్లారిటీ ఇచ్చారు.