జగన్ సర్కారుపై హైకోర్టు సీరియస్.. రెండు వారాలు డెడ్‌లైన్..
posted on Aug 23, 2021 @ 5:41PM
ఏపీ అప్పుల కుప్పగా మారింది. జీతాలు, బిల్లులు చెల్లించలేక అవస్థలు పడుతోంది. నిధులన్నీ సంక్షేమ పథకాలకే ఊడ్చేసి.. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసేశారు. ఎడాపెడా అప్పులు తెచ్చి.. పప్పుబెల్లాల్లా పంచేస్తున్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. అన్నిశాఖల సొమ్ములూ అటే మళ్లిస్తున్నారు. వివిధ పథకాల కోసం కేంద్రం ఇచ్చే సొమ్మంతా కూడా స్వాహా చేసేస్తున్నారు. మళ్లీ ఫస్ట్ తారీఖు రాగానే.. ఒక్కడ అప్పు దొరుకుతుందానని కిందామీదా పడుతున్నారు. ఇలా ఏపీ ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో ఉపాధి హామీ పథకం బిల్లులు కొండల్లా పేరుకుపోయాయి. ఎప్పటి నుంచో బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతోంది సర్కారు. దీంతో.. వారంతా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ సర్కారుపై హైకోర్టు మండిపడింది. నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో బిల్లులు చెల్లించి హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్ల జీవించే హక్కును హరించడమేనని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు. రెండు వారాల్లోపు 500 మంది పిటిషనర్లకు డబ్బు చెల్లించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. చెల్లించాల్సిన డబ్బుకు వడ్డీ, 20 శాతం మినహయింపును ప్రధాన పిటిషన్ విచారణలో పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించడమని కోర్టు వ్యాఖ్యానించింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించమని ఇప్పటికే చెప్పినప్పటికీ.. ప్రభుత్వం ఖాతరు చేయలేదని న్యాయస్థానం తప్పుబట్టింది. కేంద్రం నరేగా పనులకు నిధులు చెల్లించామని.. తమ దగ్గర బకాయిలు లేవని అఫిడవిట్‌లో చెప్పిందని కోర్టు తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం నుంచి డబ్బులు రాలేదని చెబుతోందని, ఈ రెండు పరస్పర విరుద్ధమైన అంశాలని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో బిల్లులు చెల్లిస్తామని అడ్వకేట్ జనరల్ హమీ ఇచ్చినప్పటికీ చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది. రెండు వారాల్లోగా బకాయిలన్నీ చెల్లించాలంటూ జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు.