సొంత జిల్లాలో జగన్ కు షాక్! టీడీపీలోకి సీనియర్ నేత జంప్?
posted on Aug 23, 2021 @ 11:54AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా ప్రభుత్వ వ్యతిరేకత భారీగా పెరిగిపోతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం, అభివృద్ది పనుల ఊసే లేకపోవడం, మహిళలలపై అఘాత్యాలు పెరిగిపోవడం వంటి అంశాలతో జగన్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లోనూ ఇదే తేలింది. జాతీయ స్థాయి సంస్థలతో పాటు లోకల్ ఏజెన్సీ సర్వేల్లోనూ టీడీపీ వైపే ఏపీ ప్రజలు చూస్తున్నారనే సంకేతం వచ్చింది. దీంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఇటీవల ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం ఉధృతం చేయడంతో.. ఆ పార్టీకి జనాల నుంచి మంచి స్పందన వస్తోంది.
జగన్ రెడ్డి సర్కార్ పై జనాలు కోపంగా ఉండటం, టీడీపీ ప్రజా పోరాటాలతో దూకుడుగా వెళుతుండటంతో నాయకుల చూపు కూడా ఇప్పుడు టీడీపీ వైపు పడినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే చాలా మంది నేతలు సైకిల్ ఎక్కేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కొందరు టీడీపీలోచేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతలు కూడా కొందరు తిరిగి సొంత గూటికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. కడప జిల్లాలోనూ వైసీపీకి షాగ్ తగలనుందని తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం
కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గతంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న రామసుబ్బారెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. అయితే ఆయన అధికార పార్టీలో ఇమడటం లేదని తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమస్య లేకపోయినా నియోజకవర్గ స్థాయిలో అధికార పార్టీ నేతలు అవమానించే రీతిలో వ్యవహరిస్తుండడంతో తమ నాయకుడు మనస్తాపం చెందినట్టు రామసుబ్బారెడ్డి అనుచరులు చర్చించుకుంటున్నారు. దీనితో టీడీపీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశామనే అంతర్మథనం చెందుతు న్నట్టు తెలుస్తోంది. వైసీపీ పెద్దలు కొన్ని నెలల క్రితం జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పి.రామసుబ్బారెడ్డిని కూర్చోపెట్టి చర్చించి క్లారిటీ ఇచ్చారు. 2024లో తిరిగి జమ్మలమడుగు అభ్యర్థిగా సుధీర్ రెడ్డే ఉంటారని అధిష్టానం పెద్దలు తేల్చి చెప్పారు. రామసుబ్బారెడ్డికి తగిన గౌరవం ఇస్తామని చెప్పి పంపారు.
సీఎం జగన్ సూచనలతో రామసుబ్బారెడ్డి సైలెంటుగానే ఉంటున్నా... ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయేలా కొందరు పొగపెడుతున్నారని రామసుబ్బారెడ్డి అనుచరులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో రామసుబ్బారెడ్డి మాటను ఎవరూ పట్టించుకోవద్దని అధికారులకు సదరు ప్రజాప్రతినిధి అనధికార ఆదేశాలు ఇచ్చారని సమాచారం. దీంతో ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటనే ప్రశ్న రామసుబ్బారెడ్డిని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వలేమని చెప్పినందున ఇక వైసీపీలో కొనసాగడం ఎందుకుని కొందరు ఒత్తిడి తెస్తున్నారట. అంతేకాదు టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పెరిగిపోతుండటం, వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉండటంతో రామసుబ్బారెడ్డి కూడా ఆలోచనలో పడ్డారని అంటున్నారు.
వైసీపీలో అవమానాలు భరించే కంటే.. రాజకీయ భవిష్యత్ కి పునాది వేసిన టీడీపీలో కి మళ్లీ వెళ్లాలనే ఆలోచనలో రామసుబ్బారెడ్డి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేర డంతో జమ్మలమడుగులో ప్రతిపక్ష పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని తనను గౌరవించే టీడీపీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఆయన ఉన్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రే స్వయంగా ఆదిరించినా స్థానిక నేతలతో విభేదాల వల్ల పార్టీ వీడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. శివారెడ్డి హత్యానంతరం ఆయన అన్న కుమారుడు రామసుబ్బారెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. 1994 , 99లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ , చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. 2004 నుంచి ఆయన వరుసగా ఓడిపోతూ వస్తున్నారు.