జగనన్నతో జగడమేనా?.. రాఖీ కట్టలేదంటే కలహమేనా?
posted on Aug 23, 2021 @ 6:17PM
రాఖీ. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సాక్షి. సోదరుడికి రాఖీ కట్టని సోదరి బహుషా ఉండరేమో. అందుబాటులోనే ఉండి అన్నకి చెల్లి రాఖీ కట్టలేదంటే.. వారిద్దరి మధ్య అసలే మాత్రం మంచి సంబంధాలు లేనట్టే. వాళ్లు అన్నాచెల్లిల్లు కాదన్నట్టే. రాఖీకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది మరి. అలాంటిది.. తోడబుట్టిన జగనన్నకి చెల్లి షర్మిలమ్మ రాఖీ కట్టలేదంటే..? ఏమనుకోవాలి? ఎందుకు కట్టలేదనుకోవాలి? వారి మధ్య ఉన్నవి కేవలం రాజకీయ విభేదాలేనా? అంతకుమించి గొడవలా? రాఖీ కూడా కట్టనంత కోపం ఎందుకొచ్చింది? వారి మధ్య అన్నాచెల్లెలి సంబంధం అంత దారుణంగా ఎందుకు దెబ్బతింది? జగనన్న షర్మిలమ్మకు అంత ద్రోహం చేశారా? అందుకే, రాఖీకి సైతం అనర్హుడిగా మారారా? ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలే ఇప్పుడు ఏపీలో జోరుగా వినిపిస్తున్నాయి.
అన్న-చెల్లి అంటే వాళ్లలాగే ఉండాలని.. జగన్, షర్మిలను చూసి ఒకప్పుడు అనేవారు. అన్న జైలుకెళితే.. అన్న కోసం ఇల్లు వదిలి రోడ్డెక్కారు చెల్లెమ్మ. అన్న జైల్లో ఉంటే.. పార్టీ పతనం కాకుండా.. పాదయాత్ర చేశారు. జగనన్న వదిలిన బాణాన్నంటూ.. జగన్ లేకున్నా ప్రజాక్షేత్రంలో జగన్ పేరు మారుమోగేలా చేశారు. అలాంటి అన్న.. అందలమెక్కాక చెల్లికి అన్యాయం చేశారని అంటారు. పార్టీ కోసం తనను వాడేసుకొని.. అధికారం వచ్చాక తనను కరివేపాకులా పక్కనపెట్టేశారనేది ఆ చెల్లి ఆక్రోశం అని చెబుతారు. జగన్ ఎంతోమందిని మోసం చేసినా.. చివరాఖరికి సొంత చెల్లిని సైతం అలా వదిలేస్తారని ఆమె ఊహించలేకపోయారు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక.. తాడేపల్లి ప్యాలెస్‌లో ఓ మూలన పడుండలేక.. పెట్టాబేడా సర్దేసుకొని.. అన్నపై ఆగ్రహించి లోటస్‌పాండ్‌కి మకాం మార్చేశారు.
తెలంగాణ కోడలినంటూ.. రాజన్నరాజ్యం తెస్తానంటూ.. అన్నలానే తానూ సీఎంను అవుతానంటూ.. వైఎస్సార్‌టీపీ స్థాపించి.. తనకు తోచిన రాజకీయం తాను చేసుకుపోతున్నారు షర్మిల. అయితే, షర్మిల పార్టీపై అందరికీ అనుమానం. ఆమె జగనన్న వదిలిన బాణమేనా? కేసీఆర్ కుట్రలో భాగమేనా? బీజేపీ డైరెక్షనా? ఇలా అనేక డౌట్స్. అన్నిటికంటే జగన్-షర్మిల మధ్య విభేదాలు నిజమేనా? వారిద్దరికీ చెడిందా? అనేదే ప్రధాన అనుమానం. ఆ అనుమాన నివృతి కోసం ఎప్పటికప్పుడు శల్య పరీక్షకు గురిచేస్తూనే ఉంది తెలుగు సమాజం.
నెల క్రితం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో తండ్రి సమాధి దగ్గర అన్నా-చెల్లిలు కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ, గత అలవాటుకు భిన్నంగా జగన్ ఉదయం కాకుండా సాయంత్రి తండ్రికి నివాళులు అర్పించారు. ఎందుకంటే.. మార్నింగ్ టైమ్‌లో షర్మిల ఇడుపులపాయ వచ్చారు కాబట్టి. చెల్లి ముఖం చూడకూడదనే.. జగన్ ఇలా టైమ్ మార్చుకున్నారని అన్నారు. షర్మిలపై జగన్‌కే కోపం అన్నట్టు ప్రచారం జరిగింది. వారిద్దరి బంధం బాగానే తేడా కొట్టిందని అనుకున్నారంతా. రాఖీ నాడు ఆ అనుమానంపై మరింత క్లారిటీ వచ్చింది. జగనన్నకు షర్మిల రాఖీ కట్టనే లేదు. జస్ట్.. అందరితో పాటూ జగన్‌కు సైతం రాఖీ శుభాకాంక్షలు చెబుతూ సింపుల్‌గా ట్వీట్ చేసి సరిపెట్టేశారు షర్మిల.
ట్వీట్‌ను బట్టి చూస్తే.. తనను ఆదరిస్తున్న అందరిలానే జగనన్న కూడా ఒకరనేలా.. గుంపులో గోవిందలా మార్చేశారు. రాఖీ కట్టకున్నా.. ఆ మాత్రం విషెష్ అయినా చెప్పారంటే.. వారిద్దరి మధ్య ఇంకా ఏ మూలనో బంధం-అనుబంధం దాగుందని అనేవారూ లేకపోలేదు. మరోవైపు.. ఇదంతా వారిద్దరూ కలిసి ఆడుతున్న నాటకమేనని.. ఆ పొలిటికల్ డ్రామా రక్తికడుతున్న వేళ.. షర్మిల జగన్ ఇంటికి వెళ్లి రాఖీ కడితే.. ఇప్పటి వరకూ చేసిందంతా తుస్సు మంటుందని.. అందుకే, రాఖీకి దూరంగా ఉండి.. ఉండబట్టలేక అలా ట్వీట్‌తోనైనా జగనన్నను గుర్తు చేసుకున్నారని అంటున్నారు. ఇలా దొందూ దొందే అనే వారు కొందరైతే.. రాఖీ కూడా కట్టలేదంటే.. వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయనే వారు మరికొందరు. ఇందులో ఏ వాదన నిజమో.. ఆ అన్నాచెల్లిలకే తెలియాలి.