వైసీపీకి 50 స్థానాలు మాత్రమే.. రఘురామ సర్వేలో సంచలనం..
posted on Aug 23, 2021 @ 4:40PM
ఇప్పుడంతా సర్వేల హవా నడుస్తోంది. ఇండియా టుడే-- మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సీఎం జగన్‌కు షాక్ ఇచ్చినప్పటి నుంచీ ఏపీలో సర్వేలపై ఇంట్రెస్ట్ పెరిగింది. జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోవడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేవలం 6 అంటే 6శాతం మంది మాత్రమే జగన్ బెస్ట్ సీఎం అని చెప్పడం ప్రజలు వైసీపీ పాలనపై ఎంత విరక్తితో ఉన్నారో అర్థం అవుతోంది. ఇక, ఇటీవల లోకల్ యాప్ నిర్వహించిన సర్వేలోనూ ఇలాంటి సంచలన విషయాలే వెలుగుచూశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీదే గెలుపంటూ లోకల్ సర్వే తేల్చేసింది. ఇలా వరుస సర్వేలు వైసీపీ పతనాన్ని సూచిస్తుండటం అధికార పార్టీలో కలవరం చెలరేగుతోంది. తాజాగా, నర్సాపురం ఎంపీ రఘురామ సైతం రంగంలోకి దిగారు. తాను కూడా సర్వే చేయించానంటూ ఆ వివరాలు వెల్లడించారు. రఘురామ సర్వే ఫలితాలు సైతం ఆసక్తికరంగా ఉంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 50 స్థానాలు మించి రావని తెలిపారు రఘురామ. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డిలు మళ్లీ గెలుస్తారని.. వారికి 60శాతం మంది ప్రజల మద్దతు ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరిద్దరు తప్ప వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇక పనిలో పనిగా తన సొంత నియోజకవర్గమైన నర్సాపురం సర్వే వివరాలనూ వెల్లడించారు. అయితే.. నర్సాపురంలో తనకు ప్రత్యర్థిగా జగన్ పోటీ చేస్తే.. తానే గెలుస్తానంటూ సర్వే ఫలితాలు వచ్చాయని చెప్పారు. సర్వేలో జగన్ కంటే తనకు 19శాతం ఎక్కువ ప్రజాధారణ లభించిందని తెలిపారు. రఘురామ సర్వేలో జగన్ ఓడిపోవడం.. పెద్దిరెడ్డి, చెవిరెడ్డిలాంటి వాళ్లు గెలవడం లాంటి ఫలితాలు రావడం ఆసక్తి రేపుతోంది.
మరోవైపు.. వైఎస్ వివేకా హత్య కేసుపైనా స్పందించారు ఎంపీ రఘురామ. వివేకా హత్యలో ఎవరి ప్రమేయం ఎంత ఉందోనని ప్రజలకు అనుమానం ఉందన్నారు. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, ప్రభుత్వం అమరరాజా కంపెనీ కాలుష్యం గురించి మాట్లాడుతోందని.. మరి, నాసిరకం మద్యం వల్ల పాడవుతున్న ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు రఘురామ.