30ఏళ్లుగా తాలిబన్లకి చిక్కని పంజ్‌షిర్.. తాజాగా 300 మంది హతం.. ఏమిటీ స్పెషాలిటీ?
posted on Aug 23, 2021 @ 1:56PM
తాలిబన్లు ఎంతటి బలవంతులో.. అఫ్ఘనిస్తాన్‌లో వారిపట్టు ఎంత ఉందో తాజా పరిణామాలు తెలుపుతున్నాయి. అమెరికా బలగాలు ఇలా వెనుదిరగానే.. రోజుల వ్యవధిలోనే అలా అఫ్ఘన్‌ను ఆక్రమించేసుకున్నారు ముష్కరులు. అప్పటి వరకూ ఎక్కడ నక్కారో.. సడెన్‌గా ఎక్కడి నుంచి ఊడిపడ్డారో తెలీదు కానీ.. వచ్చీరాగానే కాబూల్‌ను హస్తగతం చేసేసుకున్నారు. రాజధానే వారి గుప్పిట్లోకి రావడంతో.. ఇక అఫ్ఘన్ తాలిబన్ల రాజ్యమైపోయింది. యావత్ అఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లకు.. అదే దేశంలోని ఓ పర్వతలోయ మాత్రం ఇప్పటికీ వారి చేతికి చిక్కనేలేదు. ఇప్పుడనే కాదు.. గత 30 ఏళ్లుగా తాలిబన్లకు కొరుకుడుపడని కొయ్యలా మారింది ఆ ప్రాంతం. అదే పంజ్‌షిర్. దాని అర్థం ఐదు సింహాలు. ఆ ఏరియాకు రారాజు.. అహ్మద్ మసూద్.
కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్ ఉంది. జనాభా సుమారు లక్ష. వారంతా పోరాట యోధులు.. అక్కడి పర్వతాలు వారికి పెట్టని కోటలు. శతాబ్దాలుగా పంజ్‌షిర్‌లో అటు విదేశీ బలగాలు, ఇటు తాలిబన్లు కాలుమోపలేకపోయారు. మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్.. 1979-1989 మధ్య సోవియట్ సేనలను తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ తర్వాత నుంచి తాలిబన్లతో పోరాడారు. అయితే, తాలిబన్లు, ఆల్‌ఖైదా ఉగ్రవాదులు కలిసి జర్నలిస్ట్‌లుగా మారు వేషాల్లో వచ్చి.. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్‌కు రెండు రోజుల ముందు 2001 సెప్టెంబరు 9న ఆత్మాహుతి దాడి చేసి అహ్మద్ షా మసూద్‌ను చంపేశారు. ఆ తర్వాత.. అమెరికా, నాటో దళాలు అఫ్గన్‌పై దాడి చేయడం, మసూద్ దళాలతో ఆ బలగాల స్నేహానికి దారితీసింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన హమీద్ కర్జాయ్.. అహ్మద్ షా మసూద్‌ను నేషనల్ హీరోగా ప్రకటించడంతో పాటు ఆయన చనిపోయిన రోజును హాలిడేగా డిక్లేర్ చేశారు.
ప్రస్తుతం పంజ్‌షిర్ ప్రాంతానికి అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ చీఫ్‌గా ఉన్నారు, 9000 మంది సైన్యంతో.. అఫ్గన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌తో కలిసి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పంజ్‌షీర్‌ను ఆక్రమించుకోడానికి తాలిబన్‌లు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. తాజాగా, 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ సైన్యం ప్రకటించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
పంజ్‌షీర్ వైపు వందలాది వాహనాల్లో, భారీ ఆయుధాలతో తాలిబన్లు కదులుతున్నారు. అఫ్గన్ ప్రభుత్వ మాజీ సైన్యం, పంజ్‌షిర్ మిలీషియా బృందం సంయుక్తంగా తాలిబన్లను ఎదుర్కొంటున్నాయి. పంజ్‌షిర్ లోయకు సమీపంలోని మూడు జిల్లాలను అఫ్గన్ ప్రభుత్వ సైన్యం, ఇతర మిలీషియా గ్రూప్‌లు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లాహ్ మహ్మద్ ట్విట్టర్‌లో తెలిపారు. మరోవైపు, తమకు సరిపడా ఆయుధాలు అందించాలంటూ అమెరికాను కోరారు. పంజ్‌షిర్‌పై ఎలాగైనా పట్టుసాధించాలని తాలిబన్లు పట్టుదలగా ఉండటంతో యుద్ధం వాతావరణం ఉద్రిక్తంగా మారింది.