బుల్లెట్ సాంగ్ డ్యాన్సర్‌కి ఫుల్ సపోర్ట్.. 20 కోట్ల స్కామ్ వదిలేసి నర్సుపై చర్యలా?
posted on Aug 23, 2021 @ 1:09PM
బుల్లెట్ బండెక్కి వచ్చేస్తప.. అందాల దునియానే చూపిస్తపా.. సోషల్ మీడియాను షేక్ చేసిన పెళ్లికూతురు డ్యాన్స్ ఓ నర్సు ఉద్యోగానికి ఎసరు పెట్టిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పిహెచ్‌సిలో బుల్లెట్ బండి పాటకు ఆస్పత్రి ప్రాంగణంలో నర్సు డ్యాన్స్ చేయడం.. ఆ వీడియో సైతం వైరల్‌గా మారడం.. కలెక్టర్ ఆదేశాలతో డ్యాన్సు చేసిన నర్సుకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు మెమో జారీ చేయడం.. కాంట్రవర్సీగా మారింది. డ్యూటీలో ఉన్నప్పుడు డ్యాన్స్ ఎలా చేసారనేది అధికారుల ప్రశ్న. ఏం చేస్తే తప్పా? ఆగస్టు 15 హాలిడే రోజున సరదాగా డ్యాన్స్ చేస్తే చర్యలు తీసుకుంటారా? అంటూ తోటి ఉద్యోగులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆ నర్సుకు మద్దుతుగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా, నర్సుకు మెమో ఇవ్వడంపై ఓ సీనియర్ నర్సు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్కడితో ఆగలేదామె.. 20 కోట్ల స్కాము చేసిన నిందుతులపై చర్యలు తీసుకోరు గానీ, అణగారిన వర్గానికి చెందిన నర్సును మాత్రం శిక్షిస్తారా? అంటూ సంచలన కామెంట్లు చేస్తూ వీడియో పెట్టడంతో మరింత రచ్చ జరుగుతోంది.
డ్యాన్స్ చేసిన నర్సుకి మెమో జారీ చేయడంపై హెల్త్ డిపార్ట్‌మెంట్‌కే చెందిన ఓ సీనియర్ నర్సు నేరుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ని నిలదీసిన వీడియో సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ఆమె పలు ప్రశ్నలు సంధించారు. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ అవినీతి గురించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే పట్టించుకోని మీరు.. డ్యాన్స్ చేసిందని ఓ నర్సుపై చర్యలు తీసుకుంటారా? అని నిలదీశారు. ఆ అమ్మాయి ఏమైనా డ్యూటీలో డ్యాన్స్ చేసిందా.. పంద్రాగస్టు సెలవు రోజు ఆనందంగా డ్యాన్స్ చేస్తే తప్పా? అని నిలదీశారు. ఆమెకిచ్చిన మెమోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే నర్సులందరం సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు.
నర్సులంటే చిన్నచూపు ఉందని ఆ సీనియర్ నర్సు ఆవేదన వ్యక్తం చేశారు. 20 కోట్ల రూపాయల అవినీతి చేసినోడిపై చర్యలు తీసుకోకుండా డ్యాన్స్ చేస్తే చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. డైరెక్టర్‌పై ఫిర్యాదు చేస్తే సీఎం, మంత్రి, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ ఎవరూ పట్టించుకోలేదన్నారు. అతను కలెక్షన్ చేసి మీకు వాటాలిస్తున్నారు కాబట్టే ఆయన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారని అంతా అనుకుంటున్నారంటూ మరింత అగ్గి రాజేశారు.
మరోవైపు, డ్యాన్స్ చేసిన నర్సుకి పలువురు స్థానిక బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. పదేళ్లకు పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి.. ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోందని.. కరోనా కాలంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేసిందని చెప్పారు. అలాంటి అణగారిన వర్గానికి చెందిన పేద మహిళకు ఇచ్చిన మెమోని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
డ్యాన్స్ చేసిన నర్సుకు అన్నివర్గాల నుంచి మద్దతు పెరగడంతో జిల్లా అధికారులు సైతం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మొదటి తప్పుగా భావించి మెమోతో సరిపెట్టాలని భావిస్తున్నారట. చర్యలు తీసుకుంటే.. అనవసర రచ్చ అవుతుందని.. అందుకే ఆ ఇష్యూని ఇక్కడితో వదిలేయాలని అనుకుంటున్నారని అంటున్నారు.