కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ఫిక్స్! కేసీఆర్ నుంచి ఊహించని ట్విస్ట్?
posted on Aug 23, 2021 @ 2:37PM
తెలంగాణ కేబినేట్ లో మార్పులకు రంగం సిద్ధమైందా? సీఎం కేసీఆర్ ఊహించని ట్విస్టు ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కేసీఆర్ కేబినెట్ లో మార్పులు ఉంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని అంతా భావించారు. కాని జరగలేదు. తాజాగా మళ్లీ కేబినెట్ మార్పుల అంశం తెరపైకి వస్తోంది. ఆగస్టు 24 మంగళవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనన్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారని చెబుతున్నారు. అయితే త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చించడానికే గులాబీ బాస్.. ఈ సమావేశం ఏర్పాటు చేశారనే చర్చ సాగుతోంది. పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో కేబినెట్ మార్పులపై కేసీఆర్ సిగ్నల్ ఇస్తారని అంటున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలన్ని హుజురాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీల కార్యక్రమాలు కూడా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో మంత్రివర్గంలో మార్పులు జరిగినా.. అది హుజురాబాద్ కు లింక్ అయి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దళిత బంధు పథకాన్ని ఇటీవలే ప్రకటించారు కేసీఆర్. పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో అమలు చేస్తున్నారు. విపక్షాలు మాత్రం హుజురాబాద్ లో ఉన్న 50 వేల దళితుల ఓట్ల కోసమే దళిత బంధు స్కీం తెచ్చారని అంటున్నాయి. దళిత బంధు స్కీం ప్రకటించగానే మరికొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. దళితులను కేసీఆర్ మోసం చేశారని, మంత్రివర్గంలో మాదిగలకు చోటు లేదనే విమర్శలు వచ్చాయి. సీఎంవోలో దళిత అధికారిని ఎందుకు నియమించలేదని కొందరు ప్రశ్నించారు.
ప్రస్తుత కేబినెట్ లో కొప్పుల ఈశ్వర్ ఉన్నా ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన వారు. తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ. అందుకే విపక్షాలు ఈ అంశాన్ని లెవనెత్తుతూ కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. దళిత బంధు స్కీం తెచ్చినా అనుకున్న ఫలితం కనిపించకపోవడం, విపక్షాల విమర్శలతో సీఎం కేసీఆర్ మరిన్ని చర్యలకు ఉపక్రమించారు. సీఎంవోలో దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ రాహుల్ బొజ్జాను నియమించారు. ఇక కేబినెట్ ను విస్తరించి మరో దళిత ఎమ్మెల్యేను తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. ఈటలతో ఖాళీ అయిన మంత్రిపదవిని దళితుడితో పూరించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. ఈ లెక్కన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన చోటు ఖాయమైందని చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచే విజయం సాధించారు. సండ్రతో పాటు అశ్వారావుపేట నుంచి మచ్చా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు. సీఎం కేసీఆర్ తో సండ్రకు మంచి సంబంధాలున్నాయి. అందుకే కేసీఆర్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే సండ్ర.. టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. గత మార్చిలో మచ్చా నాగేశ్వరరావు కూడా కారెక్కారు. దీంతో టీడీడీఎల్పీ అధికారికంగా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయింది. కేసీఆర్ పురమాయించడం వల్లే.. మచ్చాతో మాట్లాడి ఆయన టీఆర్ఎస్ లో చేరేలా సండ్ర పావులు కదిపారని అంటున్నారు. అప్పటి నుంచే సండ్రకు కేబినెట్ బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత కీలకం కావడంతో మాదిక వర్గానికి చెందిన సండ్రను కేబినెట్ లోకి తీసుకుంటే తమకు కలిసివస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. సండ్రతో పాటు కేబినెట్ లో మరికొందరిని కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ దిశగా కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రితో పాటు ఓ బీసీ మంత్రికి గండం ఉందనే చర్చ తెలంగాణ భవన్ లో సాగుతోంది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందే కేబినెట్ విస్తరణతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు కేసీఆర్ తీసుకుంటారని తెలుస్తోంది.