కొవిషీల్డ్‌పై కేంద్రం రివర్స్‌గేర్.. డోసుల మధ్య వ్యవధి తగ్గించే ప్రయత్నం..
posted on Aug 26, 2021 @ 9:54PM
మొదట నెల రోజులు అన్నారు. ఆ తర్వాత 6 నుంచి 8 వారాలకు పెంచారు. అక్కడితో సరిపెట్టలేదు. మళ్లీ రివైజ్ చేశారు. ఈసారి 12 నుంచి 16 వారాలు చేసేసింది. ఇలా కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఆడిన.. ఎంతెంత దూరం.. ఇంకొంత దూరం ఆట దేశవ్యాప్తంగా విమర్శల పాలైంది. వ్యాక్సిన్ల కొరత కారణంగానే కేంద్రం ఇలా వ్యవధి పెంచి ప్రజలను పక్కదారి పట్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఏకంగా కొవాగ్జిన్ తయారుచేసే సీరమ్ సంస్థ యజమాని సైతం రెండు డోసుల మధ్య గ్యాప్ రెండు నెలలు ఉంటే చాలని.. టీకాల కొరత వల్లే కేంద్రం వ్యవధి పెంచేసిందంటూ సంచలన కామెంట్లు చేశారు. దీంతో.. కొవిషీల్డ్ డోసుల విషయంలో మోదీ సర్కారు పరువంతా పోయినట్టైంది. దీంతో.. నష్ట నివారణ చర్యలకు పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా, డోసుల మధ్య వ్యవధిని తగ్గించే ఆలోచన చేస్తోంది.
బ్రిటన్‌లో చేపట్టిన నివేదికల ఆధారంగా కొవిషీల్డ్ రెండో డోసు గడువును పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. కానీ, బ్రిటన్ మాత్రం రెండు డోసుల మధ్య గడువును తగ్గిస్తూ నాలుగు నెలల కిందటే నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ కూడా వీటిని తగ్గించే యోచనలో ఉంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84 రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించనున్నారు. కొవిషీల్డ్ డోసుల వ్యవధి తగ్గింపును ఇప్పటికే పరిశీలిస్తున్నామని.. వీటిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) నిపుణులతో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
డోసుల మధ్య గడువు పెంచడం వల్ల ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని గతంలో కేంద్ర కొవిడ్ వర్కింగ్ గ్రూప్ అభిప్రాయపడింది. తాజాగా కొత్త వేరియంట్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్ గడువుపై పునసమీక్షించనున్న కేంద్రం.. వ్యవధిని తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.