దళిత బంధు అందరికి లేనట్టేనా? కేసీఆర్ చెప్పినవన్ని ఉత్తమాటలేనా?
posted on Aug 27, 2021 @ 10:27AM
దళిత బంధు పథకాన్ని దళితులందరికి వర్తింప చేస్తాం.. మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తాం.. తర్వాత విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో దాదాపు 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి.. వీళ్లందిరికి దళిత బంధు అమలు చేయాలంటే లక్షా 70 వేల కోట్లు అవసరం.. ఇదేమి పెద్ద లెక్క కాదు.. నాలుగైదు ఏండ్లలో అందిరికి ఇచ్చేస్తాం.. ఇదీ దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. అంతేకాదు దళిత ఉద్యోగ కుటుంబాలకు కూడా పథకం అందిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రకటనతో దళితులంతా సంతోషంలో మునిగిపోయారు. తమ దశ మారబోతుందనే ఆశలో ఉన్నారు. అయితే ప్రస్తుతం దళిత బంధు స్కీమ్ సీన్ మాత్రం మరోలా కనిపిస్తోంది.
కేసీఆర్ చెప్పిన మాటలకు.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యచరణకు పొంతన ఉండడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దళిత బంధు పథకానికి అర్హులను ఎంపిక చేయడం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం , హుజురాబాద్ లో అధికారులు సర్వే నిర్వహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. హుజూరాబాద్ కు మాత్రమే కాకుండా రాష్ట్రమంతటా దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధును అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ ప్రభుత్వ మార్గదర్శకాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ పథకానికి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు నిర్దిష్ట ప్రమాణాలను ప్రభుత్వం రూపొందించింది. వాటి ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ఆ విధి విధానాల ప్రకారమే ఇప్పుడు రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ తదితర శాఖల సిబ్బంది హుజూరాబాద్లో సర్వే చేపట్టనున్నారు. మొత్తం 48 ప్రశ్నలకు సమాధానాలను దళితల నుంచి రాబట్టనున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ సర్వేను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
హుజురాబాద్ లో నిర్వహిస్తున్న సర్వే ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. దశల వారీగా రాష్ట్రమంతటా దళిత కుటుంబాలకు దళిత బంధును అమలు చేస్తున్నప్పుడు.. మళ్లీ ఈ సర్వే చేపట్టాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ఈ కొత్త మెళిక ఎందుకు పెట్టారనే విషయం అంతుపట్టకుండా ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. తెలంగాణలో నివాసం ఉన్న కుటుంబాలు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి విభాగం జీవో నంబర్ 5 ప్రకారం దళిత కమ్యూనిటీకి చెందివారు మాత్రమే అర్హులు. ఆ కుటుంబం వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.50 లక్షలు పట్టణాల్లో రూ.2.50 లక్షలు మించకూడదు. ఆ కుటుంబానికి రెండున్నర ఎకరాల మాగాణీ లేదా మెట్టతో కలిపి మొత్తం 5 ఎకరాలకు మించి సాగుభూమి ఉండకూడదు. ఆ కుటుంబంలో ఎవరికీ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. రిటైర్డ్ ఉద్యోగులూ ఉండకూడదు. కుటుంబం మొత్తానికి మించి పది గుంటలకు మించి నివాస స్థలం ఉండకూడదు. వ్యక్తిగతంగా ఫోర్ వీలర్ కూడా ఉండకూడదు.
సర్వేలో ఈ విషయాలతో పాటు ఇంట్లో ఏమేమీ వస్తువులున్నాయి ఇప్పటికే ఏమైనా ప్రభుత్వ పథకాలు అందాయా? ఏ వ్యాపారం చేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? లాంటి పూర్తి విషయాలను సేకరించనున్నారు. దీంతో హుజూరాబాద్లోని దళిత కుటుంబాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజిక వర్గాన్ని చెందిన ప్రజలు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలందరికీ అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై ఏమంటారనే ఆసక్తి నెలకొంది.