ఏపీలో వినాయక చవితి సెలవు రద్దు.. హిందు పండగపై జగన్ సర్కారు కుట్రనా?
posted on Aug 26, 2021 @ 3:31PM
సర్వ విఘ్నాలు తొలగించే దేవుడు వినాయకుడు. అలాంటిది ఆ వినాయకుడి పండుగకే విఘ్నాలు ఎదురైతే? అంతకంటే పాపం ఇంకేమైనా ఉంటుందా? ఇంతకీ అది పాపమా? కావాలనే చేస్తున్న ద్రోహమా? ఓ వర్గంపై జరుగుతున్న కుట్రలా? ఇలా అనేక అనుమానాలు. అందులోనూ, ఇలాంటి పరిస్థితులు ఏపీలోనే జరుగుతుండటం మరింత అనుమానాస్పదం. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. మత మార్పిడిలు పెద్ద ఎత్తున చేపడుతున్నారనే ఆరోపణ ఉంది. ఓ వర్గానికి అధిక ప్రాధాన్యం, ప్రోత్సాహం ఇస్తున్నారనే ప్రచారమూ ఉంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ పత్రిక.. ది ఆర్గనైజర్ సైతం జగన్ సర్కారు అవలంభిస్తున్న మత విధానాలపై తీవ్రంగా మండిపడింది. ఏపీలో హిందుత్వంపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఇంత హంగామా జరుగుతున్న సమయంలోనూ జగన్‌రెడ్డి సర్కారు మరో బరితెగింపు నిర్ణయానికి పాల్పడటం మరింత దారుణం. వినాయక చవితి పండుగకు ప్రభుత్వం బ్యాంకులకు సెలవును రద్దు చేయడం వివాదాస్పదమవుతోంది.
వినాయ చవితి చిన్నాచితకా పండగేమీ కాదు. దేశవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద ఫెస్టివల్. ఊరూరా గణపతి మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రులు పూజిస్తారు. పోటాపోటీగా వినాయక విగ్రహాలు ప్రతిష్టించి.. అట్టహాసంగా, ఆర్బాటంగా పండగ వేడుకలు నిర్వహిస్తారు. ముంబై గణేష్ ఉత్సవాలు, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విగ్రహం ఎంతో ఖ్యాతి గాంచాయి. ఏపీలోనూ వినాయక చవితి వేడుకలు భారీగా జరుగుతాయి. అలాంటిది.. ఇంత పెద్ద పండగకి.. ఏపీ ప్రభుత్వం బ్యాంకులకు సెలవు ఇవ్వకపోవడం ఏంటి? ఏటేటా ఇస్తూ వస్తున్న హాలిడేను.. ఈసారి రద్దు చేయడం ఎందుకు? దీని వెనుక ఏదైనా దురుద్దేశ్యం ఉందా అని అనుమానిస్తున్నారు హిందుత్వవాదులు.
ఈ ఏడాది సెప్టెంబరు 10న జరిగే వినాయక చవితికి ప్రభుత్వం బ్యాంకులకు సెలవును రద్దు చేసింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సెలవు ఇవ్వాలి. గడచిన ఏడాది వరకు ఇది కొనసాగింది. పక్క రాష్ట్రమైన తెలంగాణ సర్కారు ఈ ఏడాది కూడా వినాయక చవితికి సెలవును ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదు. దీనిపై బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు.
బుధవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఆ లేఖకు తెలంగాణలో బ్యాంకులు విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌ను కూడా జత చేసింది. బ్యాంకు యూనియన్స్ రాసిన లేఖపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా, వినాయక చవితికి సెలవు కావాలని వేడుకోవడం ఏంటి? ఎప్పుడు ఇచ్చినట్టుగానే హాలిడే ఇవ్వొచ్చుగా? అభ్యంతరం దేనికి? ఉద్యోగులు అడిగే వరకు ఎందుకొచ్చింది? జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇలాంటి అనుమానాలకు తావిచ్చే నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోంది? విషయం ముదిరి వివాదం కాకమునుపే ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యాంకులకు వినాయక చవితి సెలవు మంజూరు చేస్తే మంచిది. లేదంటే....