అఫ్గన్‌లో హిందువులు, సిక్కులు సేఫేనా? నెక్ట్స్ టార్గెట్ మనోళ్లేనా?
posted on Aug 27, 2021 @ 1:22PM
అఫ్గనిస్తాన్ అదుపు తప్పుతోంది. తాలిబన్లకూ అదుపు చిక్కడం లేదు. ఎవరు తాలిబన్లో, ఎవరు ఐఎస్ ఉగ్రవాదులో అర్థం కాని కన్ఫూజన్. కాబూల్ ఎయిర్‌పోర్టు ముందు జరిగిన ఆత్మాహుతి దాడిలో వంద మందికి పైగా బలి తీసుకోవడం అక్కడి దారుణ పరిస్థితికి నిదర్శణం. డజను మంది అమెరికా సైనికులతో పాటు అఫ్గన్ పౌరులు, కొందరు తాలిబన్లు కూడా దుర్మరణం పాలవడం కలకలం రేపుతోంది. తాలిబన్ల ఇలాఖాలో తాలిబన్లనే చంపేంత సాహసం చేశారంటే ఇక ముందుముందు మరెన్ని దాడులు జరుగుతాయో ఊహించవచ్చు.
కాబూల్‌లో జరిగిన జంట పేలుళ్లలో భారతీయులు తృటిలో తప్పించుకున్నట్టు సమాచారం. బాంబ్ బ్లాస్టింగ్స్ నుంచి ఆ దేశ సిక్కు, హిందూ మైనారిటీలు తృటిలో తప్పించుకున్నారు. పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు దాదాపు 160 మంది అదే ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు అఫ్గాన్‌ను విడిచివెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సరిగ్గా పేలుళ్లు జరిగిన ప్రాంతంలోనే వారంతా కొన్ని గంటల పాటు వేచి ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో పేలుళ్లపై హెచ్చరికలు రావడంతో.. భద్రతా బలగాలు అలర్ట్ చేయడంతో.. వారంతా స్థానిక గురుద్వారా కార్టె పర్వాన్‌కు తిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఆ భయమే ముప్పు నుంచి తప్పించింది. 160 మంది ప్రాణాలను కాపాడింది. ఈ విషయం కాబుల్ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు గుర్నం సింగ్ తమకు చెప్పినట్టు అకాలీదళ్ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మజీందర్ సింగ్ సీర్సా తెలిపారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.
అయితే, అఫ్గనిస్తాన్‌లోని సిక్కులు, హిందువుల పరిస్థితి ఏమాత్రం బాగాలేదని అంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ మూకల నుంచే కాకుండా తాలిబన్ల నుంచీ మనవాళ్లకి ప్రమాదం పొంచిఉందని చెబుతున్నారు. తాజాగా, ఓ సిక్కు సమూహాన్ని విమానాశ్రయంలోకి వెళ్లనీయకుండా తాలిబన్లు అడ్డుకున్నారు. ఇటీవల ఓ హిందూ ఆలయంపై దాడులు చేశారు. ఆగస్టు 31 వరకు విదేశీయులపై ఎలాంటి దాడులు చేయబోమంటూ ఇప్పటికే తాలిబన్లు ప్రకటించినందున నెలాఖరు వరకు తాలిబన్ల నుంచి ఇండియన్స్ సేఫ్ అనే చెప్పాలి. ఆ గడువు ముగిస్తే.. ఫస్ట్ టార్గెట్ సిక్కులు, హిందువులనే అనుమానిస్తున్నారు. ఎందుకంటే, ఆగస్టు 31 వరకూ అమెరికా, బ్రిటన్, జర్మనీయులు ఎవరూ మిగలకపోవచ్చు. భారత్ ఎంతగా చొరవచూపుతున్న తరలింపు ప్రక్రియ మాత్రం స్లో గానే సాగుతోందని అంటున్నారు. స్వతహాగా హిందూ ధ్వేషంతో రగిలిపోయే ముష్కర మూకలు.. డెడ్‌లైన్ ముగిశాక చెలరేగిపోతారని ప్రమాదాన్ని శంకిస్తున్నారు. అందుకే, పెద్ద సంఖ్యలో ఉన్న సిక్కులు, కొద్ది మంది ఉన్న హిందువులు ఆగస్టు 31లోగా అఫ్గనిస్తాన్ నుంచి బయటపడాలని ఆరాట పడుతున్నారు.