AP స్కూల్స్‌లో కరోనా బెల్స్.. స్టూడెంట్స్, పేరెంట్స్‌లో టెన్షన్...
posted on Aug 27, 2021 @ 12:15PM
ఓవైపు స్కూళ్లు.. మరోవైపు కొవిడ్ కేసులు.. సీఎం జగన్ చెప్పినట్టే కరోనాతో సహజీవనం చేసే రోజులు వచ్చేసినట్టున్నాయి. వద్దు వద్దంటున్నా బలవంతంగా స్కూల్స్ రీఓపెన్ చేయడంతో బడులకు వెళ్లక తప్పనిసరి పరిస్థితులు వచ్చాయి. సెకండ్ వేవ్ మధ్యలో ఉన్నామని కేంద్రం చెబుతోంది.. సెప్టెంబర్‌లోనే థర్డ్ వేవ్ అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి భయాందోళనకర పరిస్థితుల్లో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇటు స్టూడెంట్స్, అటు పేరెంట్స్ బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. స్కూల్‌కి వెళ్లకపోతే వెనకబడిపోతామేమోననే భయం. బడికి వెళితే ఎక్కడ కరోనా కాటేస్తుందోననే టెన్షన్. ఏపీలో స్కూల్స్ రీఓపెన్ అవడం.. కరోనా కేసులు పెరగడం.. బడుల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒకేరోజు 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనాను కట్టడి చేయడం మాత్రం అంత సులువైన విషయం కాదని మరోసారి తేలిపోయింది. విద్యార్థులు వైరస్ బారిన పడుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది.
ప్రకాశం జిల్లా వీరేపల్లి, వెదుల్లచెరువు పాఠశాలల్లో 9 మంది విద్యార్థులకు కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి, వట్లూరు జడ్పీ హైస్కూళ్లలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. కృష్ణా జిల్లా శంకరంపాడు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు చిన్నారులకు కొవిడ్ కన్ఫామ్ అయింది. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరింది. కరోనా కేసులతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఓవైపు కరోనా భయం.. మరోవైపు విద్యా సంవత్సరం వృథా అవుతుందేమోననే ఆందోళనల మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను భయం భయంగానే బడులకు పంపుతున్నారు. ఉపాధ్యాయులు ఆందోళనలతో విద్యా బోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు 85 శాతానికి చేరువైంది. పిల్లల సంఖ్య పెరగడం.. కరోనా కేసులు మొదలవడం సర్వత్రా భయాందోళ రేపుతోంది.