ఆస్తుల ఆమ్మకం కాంగ్రెస్ చేతికి బ్రహ్మస్త్రమా! మోడీ గ్రాఫ్ తగ్గినా మార్చుకోలేరా..
posted on Aug 26, 2021 @ 2:37PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విపక్షాలకు మరో పదునైన అస్త్రాన్ని అందించిందా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్, ప్రకటించిన, జాతీయ మానెటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ’) ఇప్పటికే దినదిన ప్రవర్థమానంగా దిగజారి పోతున్న మోడీ ప్రతిష్టను మరింతగా దిగజారుస్తుందా? జనవరిలో 66 శాతంగా వెలిగిపోయిన మోడీ గ్రాఫ్, కొవిడ్ కాలమ్లో ఆర్థిక వ్యవస్థ మిస్ మేనేజిమెంట్ పుణ్యాణ, ఏకంగా ఒకేసారి 26 శాతానికి పడిపోయిన మోడీ ఇమేజిని ఎన్ఎంపీ మరింత డ్యామేజి చేస్తుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు.
నిజానికి మోడీ తమ కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని, కాంగ్రెస్ అగ్ర నేత్ర రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అయినా, ఎందుకనో దేశ ప్రజలు ఆయన్ని విశ్వసించలేదు. కానీ, ఇప్పుడు, మోడీ ప్రభుత్వం రానున్న నాలుగేళ్లలో ప్రభుత్వ అస్తులను కుదువ పెట్టి/విక్రయించి లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల ఉపసంహరణ ద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయలు సంకుర్చుకునేందుకు, జాతీయ మానెటైజేషన్ పైప్‌లైన్ ప్రణాళికను ప్రకటించడంతో రాహుల్ గాంధీ ఆరోపణలకు బలం చేకూరింది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కొమ్ము కాస్తోందన్నఆరోపణలలో నిజముందని జనం నమ్ముతున్నారు.
ప్రభుత్వం అందించిన అస్త్రాన్ని అందుకుని, ప్రతిపక్ష పార్టీలు మోడీ సర్కార్’ పై కత్తులు దూస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో, ప్రభుత్వాలు అభివృద్ది చేసిన ప్రతిష్టాత్మక ఆస్తులను మోడీ ప్రభుత్వం తెగనమ్ముతోందని, విపక్షాలు ద్వజ మెత్తుతున్నాయి. కొద్ది మంది కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే తాజా ప్రణాళికలని రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు. కోట్లాదిమంది పౌరులకు ఉపయోగకరంగా ఉండే రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అయితే అదే సమయంలో ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదని, రాహుల్ , చిదంబరం స్పష్టం చేశారు.
మరోవంక బీజేపీ ఎదురుదాడికి సిద్దమైంది. అమేథిలో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని, కమల దళం రంగంలోకి దింపింది.దేశంలో ప్రైవేటీకరణ, మోనిటైజేషన్ శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ రాహుల్ గాంధీ ఆత్మవంచనకు పాల్పడుతున్నారని,ఆమె ఆరోపించారు. నిజమే, దేశంలో రైల్వేలు, విమానాశ్రయాలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ పీవీ, మన్మోహన్ జోడీతో ప్రారంభమైంది. మన్మోహన్ సింగ్ చిదంబరం జోడీ దాన్ని మరింత ముందుకు తీసుకుపోయింది. మన్మోహన్ పీఎం గా, చిదంబరం దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న రోజుల్లోనే విమానాశ్రయాల ప్రైవేటీకరణ మొదలైంది, అలాగే, ముంబై పూణే జాతీయ రహదారి మోనిటైజేషన్’కూడా మన్మోహన్, చిదంబరం హయాంలోనే జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రైవేటు పరం చేసింది కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే.. ఇవి గాక, బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు ఇతరత్రా రంగాల్లోనూ ప్రైవేటీకరణకు ఎంట్రీ పాస్ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వమే.
కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం అందుకు మూల్యం కూడా చెల్లించింది. యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పుల మెట్లు ఎక్కే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయం అంటే సామాన్య ప్రజలు, సొంత ఆస్తుల అమ్మకంగా భావిస్తారు. బాధ పడతారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే ఇందుకు నిదర్శనం.అందుకే, మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను భారీ మూల్యం చెల్లించడమే కాదు, రాజకీయంగా బీజేపీకి అంతకు మించిన భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని విశ్లేషకులు బావిస్తున్నారు.