లోకేష్ డెడ్ లైన్ కి ఇంకా 10 రోజులే.. జగన్ రెడ్డి సర్కార్ కు పరీక్షే?
posted on Aug 27, 2021 @ 2:52PM
ఆంధ్రప్రదేశ్ రాష్టం నేరాలు ఘోరాలకు నిలయంగా మారింది. హత్యలు నిత్యకృత్యంగా మారాయి. నిర్భయ చట్టం ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితులలో మహిళలలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు, హత్యలు యధేచ్చగా సాగిపోతూనే ఉన్నాయి. ఇటీవల వెలుగు చూసిన మంత్రులు, అధికార పార్టీ కీలక నేతలు అసభ్య సంభాషణ సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నఈ వీడియోలు నిజమో కాదో, కానీ, సామాన్య జనం మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలే ఇలా బరితెగిస్తే ఇక రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడని వాపోతున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి జనం ఛీ’ కొడుతున్నారు. తల దించుకుంటున్నారు.
రాష్ట్రంలో నడిరోడ్డు మీద పట్టపగలు హత్యలు జరిగిన పట్టించుకునే నాధుడు లేడు. ముఖ్యమంత్రి అధికార నివాసానికి కూతవేటు దూరంలో సాముహిక హత్యాచారం జరిగినా, మరో నేరం జరిగినా, ఎవరూ పట్టించుకోరు. నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలో శాంతి భద్రతలు దినదిన ప్రవర్థమానంగా దిగజారి పోతున్నాయని అధికార గణాంకాలే తెలియచేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులు ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద జరిగిన, జరుగున్న దాడులు, హత్యలకు లెక్కలు లేవు.
కొద్ది రోజుల క్రితం గుంటూరు నగరంలో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అయినా జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదు. అందుకే, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్, ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని 21 రోజుల్లో శిక్షించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.అంతే కాదు ట్విటర్ వేదికగా కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఏ రోజుకు ఆ రోజు గడువును గుర్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా నారా లోకేష్ ట్వీట్ ద్వారా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, కౌంట్ డౌన్ గుర్తు చేయడంతో పాటుగా, గట్టిగా వాతలు పెట్టారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ‘దిశ’ చట్టం తెచ్చామని, లక్షల రూపాయలు ఖర్చి పెట్టి సొంత పత్రికలో ప్రచారం చెసుకున్న ముఖ్యమంత్రి ఆ చట్టాన్ని ఎందుకు ఉపయోగించడం లేదని లోకేష్ ప్రశ్నించారు. అలాగే, ‘దిశ చట్టంతో ఉరిశిక్ష కూడా వేసేశామని మంత్రులు అంటుంటే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అలాంటి చట్టం ఏమి లేదని అంటున్నారు. దీని పై ముఖ్యమంత్రే వివరన ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వందల సంఖ్యలో ఘటనలు జరిగినా కనీసం ఒక్క ఆడబిడ్డ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇవ్వలేని ముఖ్యమంత్రి.. నష్ట పరిహారం అందించి చేతులు దులుపుకునే ప్రభుత్వ ధోరణి వలనే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని నారా లోకేష్ మండిపడ్డారు. ఇక 10 రోజులే మిగిలాయి రమ్యని అంతం చేసిన క్రూరుడికి ఉరి ఎప్పుడు?’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.