స్టూడెంట్ హాస్టల్స్ బంద్.. పిల్లల కడుపుకొట్టిన కేసీఆర్ సర్కార్..
posted on Aug 27, 2021 @ 2:18PM
కడుపు నిండితేనే చక్కగా చదువుకునేది. ఆకలితో నకనకలాడుతుంటే ఎవరికైనా చదువు ఒంటబడుతుందా? అసలే పేద విద్యార్థులు. రెక్కాడితే గానీ డొక్కాడని తల్లిదండ్రులు. ఆలాంటి దుర్భర ఆర్థిక పరిస్థితుల నుంచి డిగ్రీ దాకా రావడమే మహాగొప్ప. కష్టపడి చదవి.. తెలివితే డిగ్రీ సీటు సంపాదించిన అలాంటి వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు రోడ్డున పడే దుస్థితి దాపురించింది. కేసీఆర్ సర్కారు తీసుకున్న అడ్డగోలు నిర్ణయంతో చదువు అర్థాంతరంగా ముగించాల్సి వస్తోంది.
అవును, కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల పొట్టపై కొట్టింది. పిల్లల గూడు చెదరగొట్టింది. ఈ విద్యాసంవత్సరం తీసుకున్న పనికిమాలిన నిర్ణయంతో డిగ్రీ చదువుకునే వాళ్లు పస్తులు ఉండాల్సి వస్తుంది. తాజాగా, హైదరాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని నిజాం కాలేజీ, కోఠి మహిళా కళాశాల, సైఫాబాద్ సైన్స్ కాలేజీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఇకపై హాస్టళ్లలో అడ్మిషన్లు నిలిపేయాలని ఓయూ నిర్ణయించింది. ఈ యేడాది డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో చేరే స్టూడెంట్స్‌కు ఇకపై హాస్టల్స్ ఇవ్వరు. డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ ఇస్తారు కానీ, హాస్టల్స్ మాత్రం ఇవ్వమంటూ ప్రకటించింది ఓయూ. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరేది ఎవరు? అత్యంత పేద విద్యార్థులే ఎక్కువ మంది ఉంటారు. వారిలో చాలామందికి హైదరాబాద్ కొత్త కూడా. అలాంటిది ఇకపై కాలేజ్ హాస్టల్స్ ఇవ్వమంటే.. వారంతా నగరంలో ఎక్కడ ఉంటారు? ఎలా తింటారు? కాలేజీలకు ఎలా వస్తారు? ప్రస్తుత కొవిడ్ టైమ్‌లో ప్రైవేట్ హాస్టల్స్ కూడా నడవడం లేదు. ఉన్నా.. నెలకు 5వేలు పెట్టందే హాస్టల్‌లో ఉంచుకోరు. నెలకు ఐదువేలు పెట్టడమంటే ఆ పేద విద్యార్థులకు ఎంత కష్టం. నిజాం, కోఠి, సైఫాబాద్ కాలేజీలు ఖరీదైన ఏరియాల్లో ఉంటాయి. ఆ ప్రాంతంలో అద్దె గది దొరకడం చానా కష్టం. ఎక్కడో దూరంగా ఉన్నా.. రోజూ వచ్చిపోవడం ఇంకా కష్టం. బాయ్స్ సంగతి సరే.. కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థినులకు సైతం హాస్టల్స్ క్లోజ్ చేయడం ఇంకెతం దారుణం? అమ్మాయిలు ఈ మహానగరంలో ఎక్కడ ఉంటారు? తోడేళ్లు తిరుగుతున్న ఈ సమాజంలో వారి నుంచి కాచుకొని ఎక్కడ ఆశ్రయం పొందుతారు? పెద్ద చదువులు చదవాలనుకోవడమే ఆ పిల్లలు చేసిన పాపమా? పేదరికమే వారి నేరమా? పాలకులు, అధికారులు ఇంతటి పాపానికి ఎందుకు తెగబడుతున్నారు. డిగ్రీ స్టూడెంట్స్‌కు హాస్టల్స్ ఇవ్వమంటూ ఉత్తర్వులు జారీ చేసి.. పేదలను చదువుల నుంచి ఎందుకు దూరం చేస్తున్నారు? కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామంటూ గొప్పలు చెబుతున్న కేసీఆర్ సర్కారు.. ఇలా పేద పిల్లలకు కూడు-గూడు చెదరగొడితే ఏమొస్తుంది? ఏం సాధిద్దామని ఇలాంటి అర్థంపర్థంలేని అడ్డగోలు నిర్ణయాలంటూ విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.