తిరుమల శ్రీవారి భక్తులకు సంప్రదాయ భోజనం.. ప్రత్యేకతలు ఇవే?
posted on Aug 27, 2021 @ 10:36AM
తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు ఉచిత భోజన సదుపాయం ఉంటుంది. భక్తుల కోసం మరో కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. వెంకన్న భక్తులకు సంప్రదాయ భోజనం అందిస్తోంది. తిరుమలలో ‘సంప్రదాయ భోజన’ కార్యక్రమాన్ని గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో అన్నప్రసాదాలను తయారు చేసి.. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలుత మీడియా ప్రతినిధులకు, టీటీడీ సిబ్బందికి వడ్డించారు. 8 రోజుల పాటు పరిశీలన చేసి తర్వాత ఏయే ప్రదేశాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలి, ఓ భోజనం ఎంతకు విక్రయించాలనే అంశాలపై టీటీడీ నిర్ణయానికి రానుంది. సెప్టెంబరు 8 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
సంప్రదాయ భోజనంగా రెండు రకాల దేశీయ వరి బియ్యంతో అన్నం, పూర్ణం బూరెలు, బెల్లం పొంగలి, దోసకాయ పచ్చడి, బీరకాయ ప్రై, కొబ్బరన్నం, పులిహోర, బీన్స్ ఫ్రై, వడలు, పప్పు, సాంబారు, రసం వడ్డించారు. సేంద్రియ ఆహారం విశిష్ఠత తెలిసేలా కాస్ట్ టూ కాస్ట్ పద్ధతిలో భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. తొలిరోజు కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా తయారు చేసి అందించారు. సంప్రదాయ భోజనం స్వీకరించిన అధికారులు, సిబ్బంది.. వంటలు చాలా రుచికరంగా ఉన్నాయని చెప్పారు.
ఈ సంప్రదాయ భోజనం ప్రత్యేకత ఏమంటే.. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన వస్తువులతోనే వీటిని సిద్ధం చేస్తారు. అయితే.. దీన్ని ఉచితంగా అందించరు. కాస్ట్ టు కాస్ట్.. అంటే ఈ మీల్ ను తయారు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో.. అంత ఖర్చును వసూలు చేస్తారు. తిరుమలలో ఇప్పటికే ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. దీనికి మంచి పేరు ఉంది. ఉచితంగా అందించే భోజనంలో వడ్డించే వస్తువుల సంఖ్య తక్కువే అయినా.. దాని రుచి చాలాబాగుండటంతో.. చాలామంది భక్తులు తప్పనిసరిగా స్వామి వారి ఉచిత భోజనాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. దీని భారం అంతకంతకూ ఎక్కువైపోతున్న నేపథ్యంలో.. సరికొత్తగా టీటీడీ సంప్రదాయ భోజనం కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చింది.
ప్రస్తుతానికి మాత్రం ఉచితంగా అందిస్తూ.. ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో దీన్ని పడిన రేటుకు అమ్ముతారని చెబుతున్నారు. సంప్రదాయ భోజనంలో వ్యాధి నిరోధకతను పెంచే పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. ఆరోగ్యం మీద అవగాహన అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఈ కాన్సెప్టు అందరిని ఆకర్షించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.