రేవంత్ రెడ్డికి పీకే ఫుల్ సపోర్ట్.. కేసీఆర్ కు ఇక తీన్మారేనా?
posted on Aug 26, 2021 @ 5:42PM
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. కొన్ని రోజులుగా అన్ని పార్టీలు దూసుకు పెంచడంతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్ కేంద్రంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీజేపీ హుజురాబాద్ పై ఫోకస్ చేస్తూనే... ఆ పార్టీ సీనియర్ నేతలు యాత్రలతో జనంలో వెళ్లేలా ప్లాన్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. దళిత గిరిజన దండోరా పేరుతో గర్జిస్తున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేసి రాజకీయ వేడి రాజేశారు. ఇదిలా ఉండగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి తీవ్ర పదజాలంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు. మల్లారెడ్డి లక్ష్యంగా హస్తం నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.
మంత్రి మల్లారెడ్డి వ్యవహారంలో రేవంత్ రెడ్డికి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇటీవలే బీఎస్పీలో చేరిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఎస్పీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పీకే.. మంత్రి మల్లారెడ్డి తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండే రేవంత్ రెడ్డి గురించి.. మంత్రి మల్లారెడ్డి వాడే భాష ఏంటని ఆయన నిలదీశారు. గౌరవ స్థానంలో ఉండే మంత్రి తొడగొట్టి మాట్లాడుతారా? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నోటితో చెప్పలేనంత భాషను మీడియా సాక్షిగా మాట్లాడుతున్న మల్లారెడ్డి.. తన డీమ్డ్ యూనివర్శిటీలో ఇదే భాష నేర్పుతారా? అంటూ విరుచుకుపడ్డారు ప్రవీణ్ కుమార్. దళిత ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు.. మల్లారెడ్డిని బహిష్కరించాలని పిలుపిచ్చారు. మీకు ఈ దుర్గార్మమైన భాష ఎవరు నేర్పించారు. ఎవరి ధైర్యంతో ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు పీకే.
బండి సంజయ్ భాష కూడా సరిగ్గా లేదన్నారు ప్రవీణ్ కుమార్. ఆయనను దూషించిన నేత భాష కూడా సరిగ్గా లేదన్నారు. బూతులు మాట్లాడేవాళ్లకు యూనివర్శిటీలు సాంక్షన్ చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలో అధికార పార్టీ ఓడినా, గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి ఒరిగేదేమీలేదు. పోయేదేమీ లేదని చెప్పారు. రేపటికి రేపు మంత్రి వర్గాన్ని సీఎం రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్నారు ప్రవీణ్ కుమార్. వేల కోట్లు హుజురాబాద్ లో కుమ్మరించి ఈటలను ఓడించి..ఎవరికి పాఠం చెప్పాలనుకుంటున్నారని అన్నారు. ఈ డబ్బులన్నీ ఎవరివి? మా బిడ్డలు చెల్లించిన డబ్బులవి.. మీ పార్టీలో ఎవరైనా తోక జాడిస్తే వారిని బెదిరించడానికి ఇవన్నీ చేస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్ కుమార్. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎం చేసిన అవినీతిని బయటపెట్టాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. దుబ్బాకలో లాగే.. హుజురాబాద్ లో కూడా రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని ఆరోపించారు.
బీఎస్పీ మీటింగ్ కు కరెంట్ కట్ చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక మీ ఫామ్ హౌస్ కు కరెంట్ కట్ చేస్తామంటూ ఘాటుగా మాట్లాడారు ప్రవీణ్ కుమార్.ఉద్యోగం రాలేదని హుజురాబాద్ నియోజకవర్గంలోని సిరిసేడులో నిరుద్యోగి రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు అధైర్య పడవద్దని, బహుజన రాజ్యంలో భవిష్యత్తు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ముడేళ్లుగా ఏ జిల్లా ఏ జోన్ లోకి వెళ్లాలో తేల్చలేరా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇలాంటి కాలయాపనే చేస్తారా? అన్నారు. 2022 దాకా నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకం లేదన్నారు ప్రవీణ్ కుమార్.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల సమస్యలు తీరలేదన్నారు ప్రవీణ్ కుమార్. కోటి ఎకరాల సాగులోకి వస్తాయన్నారు.. కానీ భూములు కోల్పోయిన వారికి ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం బడా కాంట్రాక్టర్లకే లాభం జరిగింది. వేల కోట్ల రూపాయల అవినీతి, దోపిడి జరిగిందని ఆరోపించారు.అవినీతి పాలవుతున్న సొమ్మునంతా చదువుల కోసం ఖర్చు చేసి.. ప్రపంచంలోనే అత్యున్నత అవకాశాలు పొందేలా యువతను తీర్చిదిద్దుతామని పీకే చెప్పారు. ఏనుగు గుర్తుకే ఓటేస్తామని అందరూ కుటుంబసభ్యులతో, బంధువులతో ప్రమాణం చేయించాలన్నారు ప్రవీణ్ కుమార్. ప్రతి ఇంటి గోడపై ఏనుగు గుర్తు గీయించుకోవాలన్నారు. కారు కింద పడుతారా? ఏనుగు ఎక్కిపోతారా? తేల్చుకోవాలని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.